భార్య కాపురానికి రావడంలేదని.. హై టెన్షన్ టవర్ ఎక్కాడు - MicTv.in - Telugu News
mictv telugu

భార్య కాపురానికి రావడంలేదని.. హై టెన్షన్ టవర్ ఎక్కాడు

September 22, 2022

భార్య కాపురానికి రావటంలేదని ఓ వ్యక్తి టవర్ ఎక్కి నానా రచ్చ చేశాడు. 75 అడుగుల ఎత్తైన హై టెన్షన్‌ విద్యుత్‌ టవర్‌ ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా విని చివరకు పోలీసుల వరకూ చేరింది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ రాష్ట్రంలోని భిలాయ్‌ గనియారి గ్రామానికి చెందిన యువతితో హోరీ లాల్‌ అనే వ్యక్తికి ఇటీవలే వివాహం జరిగింది. ఈ క్రమంలోనే పుట్టింట్లో ఉంటున్న భార్యను తనతో తీసుకువెళ్లేందుకు వచ్చాడు హోరీ లాల్. అయితే, భార్యను తనతో పంపేందుకు అత్తమామలు నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన ఆ వ్యక్తి గ్రామంలో ఉన్న 75 అడుగుల పొడవైన హై టెన్షన్ విద్యుత్‌ టవర్ ఎక్కాడు. భార్యను తనతో పంపాలని డిమాండ్‌ చేస్తూ నిరసనకు దిగాడు. విషయం తెలిసి ఊరిజనం, చుట్టు పక్కల గ్రామస్తులు సైతం భారీగా అక్కడకు చేరుకున్నారు. ఎవరూ చెప్పిన అతడు వినిపించుకోలేదు. దాంతో ఆ ప్రాంతమంతా టెన్షన్‌ వాతావరణం ఏర్పడింది.

చివరకు విషయం పోలీసులకు చేరింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు…హోరి లాల్‌కు నచ్చజెప్పి హై టెన్షన్ విద్యుత్‌ టవర్ పైనుంచి కిందకు రప్పించేందుకు ప్రయత్నించారు. తొలుత అతడు నిరాకరించాడు. అయితే భార్యను అతడితో పంపుతామని పోలీసులు హామీ ఇచ్చారు. దీంతో అతడు ఆ హై టెన్షన్‌ విద్యుత్‌ టవర్‌ పైనుంచి కిందకు దిగాడు. అనంతరం పోలీసులు హోరి లాల్‌ను, అతడి అత్తామామలను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇప్పించారు. అసలు అల్లుడితో కూతురిని పంపడానికి అత్తామామలు ఎందుకు నిరాకరించారో కానీ.. హోరీ లాల్ చేసిన నిర్వాకానికి సంబంధించిన వీడియో మాత్రం ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది.