Watch: Noida Executive, Named In Rape Case, Runs Over Guard To Escape
mictv telugu

సెక్యూరిటీగార్డుపైకి కారుతో దూసుకెళ్లిన రేప్ కేసు నిందితుడు

November 10, 2022

అత్యాచార కేసులో నిందితుడుగా ఉన్న ఓ వ్యక్తి.. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు సెక్యూరిటీ గార్డుపైకి కారుతో దూసుకెళ్లాడు. మంగళవారం సాయంత్రం నోయిడాలో ఈ ఘటన చోటు చేసుకోగా.. సెక్యూరిటీ గార్డు తీవ్ర గాయాలపాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నోయిడాలోని సెక్టార్‌ 120లోగల అమ్రపాలీ జోడియక్‌ సొసైటీలో నివాసం ఉండే నీరజ్‌ సింగ్‌ ఓ ప్రైవేటు కంపెనీలో జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అయితే అదే కంపెనీలో తన సహోద్యోగిని అత్యాచారం చేసినట్లు సింగ్‌పై స్థానిక పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇందులో భాగంగా సింగ్‌ను అరెస్టు చేసేందుకు పలుమార్లు పోలీసులు ప్రయత్నించారు.

ఎన్నిసార్లు అపార్ట్‌మెంట్‌ సొసైటీ వద్దకు వచ్చినా.. అతడు తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో నిఘా పెట్టిన పోలీసులు మంగళవారం సాయంత్రం సమయంలో సింగ్‌ ఇంట్లోనే ఉన్నాడన్న సమాచారంతో అక్కడికి చేరుకున్నారు.ఈ విషయం తెలుసుకున్న నీరజ్‌ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతనికి అడ్డుగా వచ్చిన సెక్యూరిటీ గార్డు అశోక్‌ మావీని కారుతో బలంగా ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో సదరు సెక్యూరిటీ గార్డు కాలు, భుజాలకు తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సొసైటీలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.