Watch: Private bus in Kerala gets chased by wild elephant, viral video
mictv telugu

బస్సును వెంటాడిన ఏనుగు.. రివర్స్ గేర్‌లో 8 కి.మీ.

November 17, 2022

కేరళలో ఓ గజరాజు బస్సును పరుగు పెట్టించింది. అడవి మార్గం గుండా వెళ్లుతున్న బస్సు ముందు హఠాత్తుగా ఓ ఏనుగు ప్రత్యక్షమైంది. పొడవైన దంతాలతో ఉన్న ఆ ఏనుగు ఆగ్రహంతో బస్సు వైపు దూసుకువెళ్లింది. దీంతో ఆ డ్రైవర్‌కు ఏం చేయాలో పాలుపోలేదు. ఎదురుగా బస్సు వైపు వస్తుండటంతో డ్రైవర్ ఆ బస్సును మెల్లగా రివర్స్ గేర్ వేసి వెనక్కి తీశాడు. కానీ, ఆ ఏనుగు అంతటితో వెనక్కి వెళ్లిపోలేదు. ఆ బస్సునే వెంటాడింది. దీంతో బస్సును మరింత వేగంతో వెనక్కి పోనివ్వాల్సి వచ్చింది. అలా ఏకంగా 8 కిలోమీటర్లు ఆ బస్సును వెనక్కి తీసుకెళ్లాల్సి వచ్చింది.

ఏనుగు ఆ బస్సునే వెంటాడంతో.. బస్సులో డ్రైవర్ సహా ప్రయాణికులందరికీ ముచ్చెమటలు పడ్డాయి. కానీ, వారి ముందు ఉన్న ఏకైక మార్గం బస్సును వెనక్కి వెళ్లనివ్వడమే. ఆ ఏనుగు వెంబడించడం ఆగే వరకు రివర్స్ వెళ్లడమే వారికి ఉన్న అవకాశం. అందుకే ఆ ఏనుగు వెంటాడినంత దూరం బస్సును వెనక్కి పోనిచ్చాడు. దీంతో ఆ రోడ్డు సరిగ్గా లేకున్నా.. ఇరుగ్గా, ఇతర సమస్యలు ఉన్నప్పటికీ బస్సును వెనక్కి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో కొన్ని ఊర్లే దాటేశాడు. దాదాపు 8 కిలోమీటర్ల మేరకు బస్సు వెనక్కి వెళ్లిపోయిన తర్వాత ఓ గ్రామ సమీపానికి రాగానే ఆ ఏనుగు అడవిలోకి వెళ్లిపోయింది. దీంతో బస్సులోని వారంతా ఊపిరి పీల్చుకున్నారు.