Watch: Rahul Gandhi Sprints, Others Follow At Congress March In Telangana
mictv telugu

జోడో యాత్ర.. పరుగులు పెట్టించిన రాహుల్

October 30, 2022

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’ మహబూబ్‌నగర్‌ జిల్లాలో కొనసాగుతోంది. ఆదివారం పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ‘ఫిట్‌నెస్‌ ఫర్‌ భారత్ జోడో’ అంటూ రాహుల్‌ కొద్దిసేపు పరుగు తీసి కాంగ్రెస్ శ్రేణులను ఉత్తేజపరిచారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సహా పార్టీ కార్యకర్తలు ఆయన్ను అనుసరిస్తూ పరుగు తీశారు. ఈ పాదయాత్రలో రాహుల్‌ గాంధీతో ప్రముఖులు, ప్రజలు నడుస్తున్నారు. నిన్న రాత్రి జడ్చర్ల సమీపంలోని గొల్లపల్లిలో బస చేసి రాహుల్‌ ఈ రోజు ఉదయం అక్కడి నుంచే పాదయాత్రను ప్రారంభించారు.

ఈ రోజు ఉదయం 11 గంటలకు బాలానగర్ జంక్షన్ వద్దకు రాహుల్‌ గాంధీ పాదయాత్ర చేరుకుంటుంది. నేడు రచయిత ఇండస్ మార్టెన్ బృందంతో రాష్ట్రంలో ఎస్సీలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాహుల్ చర్చించనున్నారు. అనంతరం ఉపాధి హామీ రైతు కూలీలతో సమావేశమై వారి సమస్యల గురించి తెలుసుకోనున్నారు. ఆ తర్వాత భోజనం విరామం.. మళ్ళీ సాయంత్రం 4 గంటలకు రాహుల్ పాదయాత్ర పున:ప్రారంభమవనుంది. అయితే.. పాదయాత్ర ప్రారంభమైన కొద్దిసేపటికీ చిన్నారులతో కలిసి రాహుల్‌ గాంధీ పరుగులు పెడుతూ కాంగ్రెస్ శ్రేణులను ఉత్తేజపరిచారు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్‌ ట్విట్టర్‌ వేదికగా పంచుకుంది.