Home > Featured > యాచకురాలి నుంచి గాయనిగా.. వరుస ఛాన్సులతో బిజీ..

యాచకురాలి నుంచి గాయనిగా.. వరుస ఛాన్సులతో బిజీ..

Ranu Mandal..

ఒక్క పాటతో ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. రైల్వేస్టేషన్‌లో చేయి చాచి అడుక్కుని జీవనం వెళ్లదీసే యాచకురాలు రాణు మండల్ ఇప్పుడు సెలెబ్రిటీ అయిపోయారు. రైల్వే స్టేషన్‌లో పాటలు పాడితే దానం చేసేవాళ్లు ఇంకా ఏమైనా ఎక్కువ దానం చేస్తారేమోనని ఆమె ఆశపడింది. కానీ, ఆమె ఆశపడ్డదానికి ఇంకా ఎక్కువే జరిగింది. ఆమె ఊహించని విధంగా ఇప్పుడు గాయనిగా అడుగులు వేస్తోంది. బాలీవుడ్ సీనియర్ గాయని లతా మంగేష్కర్ ఆలపించిన ‘ఏక్ ప్యార్ కా నగ్మా హై..’ పాట తన జీవితాన్ని మార్చేసిందని చెబుతున్నారామె.

రైలు కోసం ఎదురు చూస్తూ కూర్చున్న ఓ ప్రయాణికుడు ఆమె పాడుతుంటే చూసి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఆమె గానామృతం ప్రపంచ దృష్టికి వెళ్లింది. బాలీవుడ్ ప్రముఖులంతా ఆమె గాత్రానికి ఫిదా అయ్యారు. ఇంకే ఆమెకు అవకాశాలిస్తామంటూ ఎన్నో సంస్థలు ముందుకు వచ్చాయి. కట్టూ బొట్టూ, వస్త్రాధారణను మార్చేశారు. స్టూడియోలో కూర్చోబెట్టి మైక్ ముందు పెట్టారు. అదే స్వరం మరింత మధురంగా వినిపించింది. ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు, గాయకుడు హిమేశ్ రేషమ్మియా తాను తెరకెక్కిస్తున్నసినిమాలో మొదటి పాట పాడే అవకాశం కల్పించారు. ఆమె స్టూడియోలో పాట పాడుతున్నప్పుడు రికార్డ్ చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. నా కొత్త చిత్రం కోసం రాణు చేత ఓ పాట పాడించాను. కలల్ని సాకారం చేసుకోవాలంటే ధైర్యం, పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే చాలు అని ఆయన పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఇంకా చాలామంది ఆమెతో సినిమాల్లో పాటలు పాడించాలని ముందుకు వస్తున్నారు. కొన్ని రోజుల క్రితం మన తెలుగులో కూడా మట్టి మనిషి బేబీ కూడా ఇలాగే పాట పాడి ఫేమస్ అయిన విషయం తెలిసిందే. కళ ఎవరి సొత్తు కాదని ఇలాంటి మట్టి మనుషులు సోషల్ మీడియా పుణ్యమా అని తెరమీదకు వస్తున్నారు. ఈ క్రమంలో రాణు మండల్ తనకు దక్కిన అదృష్టానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇది తాను ఊహించలేదని.. అలా జీవితమంతా రైల్వే స్టేషన్‌లో పాటలు పాడుకుంటూ చేయిచాచి బతికేస్తానేమో అనుకున్నానని.. కానీ, ఇలా తన జీవితం మారిపోతుందని ఊహించలేదని ఆమె ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated : 24 Aug 2019 8:29 AM GMT
Tags:    
Next Story
Share it
Top