సెల్ఫీ పిచ్చోడిపై చిరుతపులి పంజా (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

సెల్ఫీ పిచ్చోడిపై చిరుతపులి పంజా (వీడియో)

August 19, 2019

గాయపడ్డ పులి పిల్లితో సమానం అనుకుంటే ఎలా? గాయపడినా.. అది బిక్కచచ్చిపోయినా తన పులి నైజాన్ని పోగొట్టుకుంటుందా? నా ఒంట్లో బాగాలేదని గమ్మున ఊరుకుంటుందా? పంజా విసిరి రక్కి పీక్కు తినడానికి వెనకాడదు. ఈ ఘటన అలాంటిదే. రోడ్డు పక్కన ఓ చిరుత గాయపడి వుంది. దీంతో అది ఏమీ అనదని భావించారు కొందరు. ఇంకే ఎంచక్కా తమతమ ఫోన్లు తీసి యాక్షన్ అన్నట్టు దానిముందు పెట్టి కెమెరాలు ఆన్ చేశారు. దానిని తాను అతి దగ్గరగా తీశానని ఆ ఫోటోను, వీడియోను సోషల్ మీడియాలో పెట్టాలనే కుతూహలం వాళ్లల్లో ఎక్కువైంది.  ‘ఏయ్ చిరుతా.. ఇలా పోజ్ ఇవ్వు.. ఆ కాలు అలా పెట్టు’ అన్నట్టు ఫోటోలు, వీడియోలు తీస్తున్నారు. తీస్తే తీశారు గానీ, దానికి దూరంగా వుండి తీసుకోవచ్చు కదా. ఓహో అది గాయపడ్డ చిరుత కదా.. ఏమంటుందిలే అని వాళ్ల ధైర్యం కాబోలు.

కానీ, ఆ చిరుత వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఒక్కసారిగా ఒకతని మీద విరుచుకుపడింది. మజాగ్గా వుందా? నా ఫోటోలు తీస్తావా? నేను రక్కాక, పులి నన్నిలా రక్కిందని సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పెట్టుకో అన్నట్టు అతనిపై మెరుపుదాడి చేసింది. దెబ్బకు అందరూ హడలిపోయారు. ఈ తతంగాన్ని వీడియో తీస్తున్న అతని చేతులు కూడా వణికాయి. అదృష్టం బాగుండి అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. పులి అతనిపైకి దూకింది కానీ, తన ఒంట్లో బాగాలేకపోవడంతో ఇంకా ఏమీ చేయలేక స్వల్పంగా గాయపరిచి వదిలిపెట్టింది. కుయ్యోమొర్రో అని అతను ప్రాణాలు కాపాడుకుని దూరంగా పరుగులు పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్దౌర్‌లో రోడ్డు పక్కన చోటు చేసుకుంది. ఈ వీడియోను చూసినవారంతా అతనిపై జాలి చూపకుండా కమెంట్లతో పంజా విసురుతున్నారు. ‘పులితో ఫోటోలేంటో.. బాగైంది’ ‘ఇంకా నయం దానికి హగ్ ఇవ్వాల్సింది’ ‘దాని మానాన దాన్ని వుండనివ్వాలి. అనవసరంగా దాని స్వేచ్ఛకు భంగం కలిగిస్తే ఇలాగే వుంటుంది’ అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.