Watch: Workers flee COVID-19 lockdown at China's biggest iPhone factory
mictv telugu

కఠినమైన ఆంక్షలు.. ఐఫోన్ ఫ్యాక్టరీ నుంచి పారిపోతున్న కార్మికులు

November 1, 2022

కరోనా మహమ్మారి నుంచి ప్రపంచ జనాభా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. జనం మళ్లీ సాధారణ జీవనం గడుపుతున్న తరుణంలో మళ్ళీ చైనాలోని కొన్ని నగరాల్లో కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళనను కలిగిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి చాలా నగరాల్లో కఠినమైన ఆంక్షలతో పాటు లాక్ డౌన్ విధిస్తున్నారు. తాజాగా జెంగ్‌జౌలో లాక్‌డౌన్ ను అమలు చేస్తున్నారు అధికారులు. దీంతో నగరంలో ఉన్న యాపిల్ ఐఫోన్లను తయారు చేసే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు, కూలీలు స్వగ్రామాలకు పయనమయ్యారు. వారంతా కాలినడకన తమ ఇళ్ల వైపు వెళ్తున్నారు. ఇందుకోసం రాత్రింబవళ్లు 100 కి.మీ వరకు ప్రయాణిస్తున్నారు. ఫ్యాక్టరీ దాటి పారిపోతున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

చైనాలోని హెనాన్ ప్రావిన్స్, జెంగ్జోవు సిటీ పరిధిలో అతిపెద్ద ఐఫోన్ తయారీ ఫాక్స్‌కాన్ కంపెనీలో దాదాపు 20,000 మంది కార్మికులు ఉంటున్నట్లు అంచనా. ఫ్యాక్టరీలో భారీ స్థాయిలో కోవిడ్ కేసులు నమోదవుతుండడంతో అక్కడి అధికారులు కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. అయితే, సరైన వైద్య సదుపాయంతోపాటు, ఆహారం, ఇతర వసతులు కల్పించడం లేదు. దీంతో అక్కడ పనిచేసే కార్మికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉంటే ప్రమాదమని భావించిన చాలా మంది కార్మికులు ఫ్యాక్టరీ నుంచి పారిపోతున్నారు.

ఫ్యాక్టరీ యాజమాన్యం అందుకు అనుమతించకపోవడంతో వాళ్లంతా గేట్లు దూకి పారిపోతున్నారు. అవసరమైన లగేజ్, కొన్ని వస్తువులు మాత్రమే తీసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోతున్నారు. కోవిడ్ సోకే అవకాశం ఉండటంతోపాటు, సరైన సౌకర్యాలు లేని కారణంగా వీళ్లంతా వెళ్లిపోతున్నారు. అక్కడి వీధులన్నీ పారిపోతున్న కార్మికులతో కనిపిస్తున్నాయి. ఈ ఘటనలకు సంబంధించిన దృశ్యాల్ని అక్కడి మీడియా ప్రతినిధులు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు అక్కడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.