జట్కా బండి అనగానే మనకు టక్‌టక్‌మని శబ్దం చేసే గుర్రమే గుర్తుకు వస్తుంది. కొన్ని చోట్ల కుక్కలు కూడా జట్కాను లాగుతుంటాయి. మనవద్ద అయితే జట్కాకు బదులు ఎడ్ల బళ్లు ఉంటాయి. దున్నపోతులు, ఎద్దులు బళ్లను లాగుతుంటాయి. అయితే, ఓచోట మాత్రం గుర్రానికి బదులు ఓ మర జంతువు జట్కాను లాగేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ మరజంతువు రోబో డాగ్. రోబో డాగ్ నాలుగు కాళ్లతో నడవడమే ఒకెత్తు అయితే.. ఈ రోబో డాగ్ ఏకంగా జట్కాను లాగడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అమెరికన్ స్పెషల్ ఎఫెక్ట్స్ డిజైనర్, టెలివిజన్ పర్సనాలిటీ ఆడం సావేజ్ తన జట్కాను లాగడానికి రోబో డాగ్‌ను వాడారు. ఆయన జట్కా ఎక్కి ‘మార్కెట్‌కు వెళ్లు’ అని చెప్పగానే ‘జీ హుజూర్’ అన్నట్టుగానే జట్కాను లాగుకుంటూ ముందుకు కదిలింది. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు పోస్ట్ చేశారు. మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్లో ఈ వీడియోను వేలాదిమంది వీక్షించారు. ‘భలే గమ్మత్తుగా ఉందే జట్కా. యజమానికి ఈ రోబో డాగ్‌ను మేపాల్సిన అవసరమే లేదు’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా, ‘స్పాట్’ అనే ఈ రోబో డాగ్‌ను అమెరికన్ ఇంజినీరింగ్, రోబోటిక్స్ డిజైన్ సంస్థ బోస్టన్ డైనమిక్స్ రూపొందించింది.
Future Rickshaws ?! See this amazing prototype of a robot-driven Rickshaw carriage
Credits – Adam Savage- Boston Dynamics pic.twitter.com/YAN3YAjQoJ
— Supriya Sahu IAS (@supriyasahuias) October 19, 2020