మద్యం అక్రమ రవాణా.. అడ్డుకున్నందుకు వాచ్‌మన్ హత్య!  - Telugu News - Mic tv
mictv telugu

మద్యం అక్రమ రవాణా.. అడ్డుకున్నందుకు వాచ్‌మన్ హత్య! 

May 5, 2020

Watchman incident for obstructing alcohol trafficking in ap

దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాలతో ఒక్కసారిగా తీవ్ర గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మళ్లీ కరోనా వ్యాపిస్తుందేమోననే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో కృష్ణాజిల్లాలో మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. 

మద్యం తాగితే దారుణాలకు పాల్పడ్డారని అనుకోవద్దు.. మందు కొని విషాదాన్ని కొనితెచ్చుకున్నారు. స్ధానికంగా ఉండే ఓ వైన్ షాపు నుంచి ఇద్దరు ఉద్యోగులు లాక్‌డౌన్ ఉన్నా అక్రమంగా మద్యం తరలిస్తున్నారు. వాళ్లను కోటేశ్వరరావు అనే వాచ్‌మెన్ అడ్డుకున్నాడు. దీంతో ఆగ్రహించిన వారు వాచ్‌మెన్‌పై దాడి చేశారు. అనంతరం మద్యాన్ని ఎత్తుకెళ్లారు. 

ఈ ఘటనలో వాచ్‌మెన్ మృతిచెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అతని మృతికి గల కారణాలను వెల్లడించారు. వైన్‌షాప్ ఉద్యోగులతో వాగ్వాదం, దాడి తర్వాత మనస్తాపానికి గురైన వాచ్‌మెన్ కోటేశ్వరరావు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. దీనిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వైన్‌షాప్ ఉద్యోగులు తమ బండారం బయటపడుతుందనే భయంతోనే వాచ్‌మెన్‌కు పురుగుల మందు తాగించి చంపారని ఆరోపించారు.

ఈ కేసును సమగ్రంగా విచారణ జరిపి దోషులపై కఠిన శిక్ష వేయాలని డిమాండ్ చేస్తూ పోలీసు స్టేషన్ ముందు స్ధానికులు బైఠాయించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. విచారణ జరిపి దోషులను శిక్షిస్తామని హామీ ఇచ్చారు. కాగా, మృతుడు కోటేశ్వరరావు గతంలో స్ధానిక ఎంపీపీగా పనిచేశాడు. దీంతో ఆయనకు స్థానికంగా మంచి పేరుంది.