మైక్ టీవీ శ్రేయోభిలాషి, నటుడు బోస్ అంకుల్ కన్నుమూత - MicTv.in - Telugu News
mictv telugu

మైక్ టీవీ శ్రేయోభిలాషి, నటుడు బోస్ అంకుల్ కన్నుమూత

May 24, 2020

Bose uncle.

కరోనా కష్టకాలంలో సామాన్యుడి గుండె పగిలింది. మీ అభిమాన మైక్ టీవీ కార్యాలయం ఉన్న అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్, ఔత్సాహిక నటుడు సుభాష్ చంద్రబోస్ ఈ రోజు మధ్యాహ్నం ఆకస్మిక గుండుపోటుతో కన్నుమూశారు. 70 ఏళ్ల బోస్ స్వస్థలం కోదాడ. పదేళ్ల కిందట బతుకు తెరువు కోసం హైదరాబాద్ చేరుకున్న ఆయన చిన్నాచితాక పనులు చేసి, తర్వాత వాచ్‌మెన్‌గా మారారు. ఆయనకు భార్య, మనవళ్లు ఉన్నారు. 

బోస్ మైక్ టీవీ సిబ్బందికి అంకుల్‌గా ఎంతో ప్రేమాస్పదుడు. మైక్ టీవీ నిర్మించే లఘుచిత్రాలకు సహకరించేవారు. ఉత్సాహంగా తనూ కొన్ని చిన్నచిన్న పాత్రలు పోషించేవారు. పోలీస్, బాబాయ్, తాతయ్య వంటి పాత్రల్లో ఇమిడిపోయేవారు. నటనలో ఎలాంటి శిక్షణా లేకపోయినా పాత్ర స్వభావాన్ని చక్కగా ఆకళింపు చేసుకునే వారు. సంభాషణలను కూడా అలవోకగా పలికేవారు. ‘చిచోరా గ్యాంగ్’ సిరీస్ తోపాటు అనేక లఘాచిత్రాల్లో ఆయ కనిపించారు.  ‘మీరు వయసులో ఉన్నప్పుడు సినిమాల్లోకి ట్రై చేసి ఉండాల్సింది.. ’ అంటే ‘మాలాంటి వాళ్లకు అవకాశం ఎక్కడ దొరుకుతుంది?’ అనేవారు. అవకాశాలు, కాస్త చేయూత అందిస్తే సామాన్యులు కూడా అన్ని రంగాల్లోనూ సత్తా చాటగలరని చప్పడానికి బోస్ అంకుల్ ఒక ఉదాహరణ. మైక్ టీవీ ఆఫీసుకు రోజూ వచ్చి పత్రికలు చదివే ఆయన సమకాలీన రాజకీయాలను నిశితంగా వ్యాఖ్యానించేవారు. మైక్ టీవీకి బోస్, ఆయన సతీమణి అందించిన సేవలకు గాను అధినేత అప్పిరెడ్డి, సీఈవో సతీష్ కుమార్‌లు ఆ దంపతులకు కొత్తబట్టలు పెట్టి సత్కరించారు. 

బోస్ అంకుల్ కేవలం తన కుటుంబం కోసం మాత్రమే కాకుండా బంధుమిత్రుల బాగోగులు కూడా చూసుకుంటున్నారు. ఎంతోమందిని చేరదీసి చదివిస్తున్నారు. పల్లెల నుంచి పొట్టకూటికోసం హైదరాబాద్ వచ్చే బంధువులకు ఆయన ఇల్లు పెద్ద అండ. అలాంటి బోస్ అంకుల్ ఆకస్మిక మరణం ఎందరినో కలిచివేస్తోంది. ఆయన మృతికి మైక్ టీవీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తోంది.