వలస కార్మికులతో లాక్‌డౌన్ ఆటలు.. 4000 మంది బోట్లలోనే  - MicTv.in - Telugu News
mictv telugu

వలస కార్మికులతో లాక్‌డౌన్ ఆటలు.. 4000 మంది బోట్లలోనే 

April 4, 2020

Waters around Mumbai become refuge for stranded fishermen

దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో వలస కార్మికలు పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. కాలి నడకన తమ స్వగ్రామాలకు వెళ్తూ కొందరు కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా  ముంబైలో చిక్కుకుపోయిన దాదాపు 4 వేల మంది వలస కార్మికులు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు జాలర్ల బోట్లను ఆశ్రయిస్తున్నారు. మహారాష్ట్ర పశ్చిమ తీరంలో లంగర్ వేసిన బోట్లలో తల దాచుకుంటున్నారని మహారాష్ట్ర ఫిషనరీ కో ఆపరేటివ్ లిమిటెడ్ ఛైర్మన్ రాందాస్ వెల్లడించారు. వారంతా 20 వేల బోట్లలో పనిచేస్తున్నవారని చెప్పారు. సముద్ర తీరానికి దూరంగా, సముద్రం మధ్యలో బతుకు వెళ్లదీస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ నుంచి గతేడాది సెప్టెంబరులో ముంబై వచ్చిన వీరేంద్ర కుమార్ నిషాద్ ఇప్పుడు మరో ఏడుగురితో కలిసి బోటులోనే నివసిస్తున్నాడు. వెర్సోవాలోని సముద్రంలో కిలోమీటరు లోపల లంగరు వేసిన బోటులో ఉంటున్నాడు. అటు ఇంటికి వెళ్లడానికి వీలులేక.. ఇక్కడ ఉండటానికి ఇల్లు లేక బోటులోనే ఉంటున్నాం అని వీరేంద్ర తెలిపాడు. కిరోసిన్ స్టవ్‌పై వంట చేసుకుంటూ.. ఉన్న సరుకులు అయిపోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నామని వాపోయాడు. ఖర్చులకు డబ్బులు లేక ఉదయం టిఫిన్లు చేయడం కూడా మానేశాం అని చెప్పాడు.  

మరోవైపు, లాక్‌డౌన్ కారణంగా దాదాపు రూ.1.5 లక్షలు నష్టపోయినట్టు బోటు యజమాని రాజేశ్ కాలే ఆవేదన వ్యక్తం చేశాడు. మరో బోటులో 41 ఏళ్ల కిశోర్ పాటిల్ మరో 9 మంది జాలర్లతో కలిసి ఉంటున్నాడు. ‘చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లాం. 15 రోజుల తర్వాత గత నెల 22న ముంబైలోని ఫెర్రీ వార్ఫ్‌కు చేరుకున్నాం. అప్పుడే దేశంలో జనతా కర్ఫ్యూ పాటించారు. ఆ తర్వాత మొత్తం బంద్ అన్నారు. దీంతో మాకు వేరే గత్యంతరం లేకుండా పోయింది.  మేమంతా ముంబైలో చిన్నచిన్న గదుల్లో నివసిస్తుంటాం. అక్కడ ఉండేందుకు తగిన వసతులు ఉండవు. కాబట్టి మేము బోట్లలోనే ఉంటున్నాం. ప్రస్తుతం బోటులో ఉండడమే సురక్షితం. మాకేమైనా అవసరం ఉంటే రెండు రోజులకు ఒకసారి యజమానికి పోన్ చేస్తాం. వారు మాకు తరచూ ఫోన్లు చేయరు. ఎందుకంటే బోటులో చార్జింగ్ చేసుకోవడం కష్టం. బోటు ఆన్‌లో ఉన్నప్పుడు చార్జింగ్ చేయగలుగుతాం. ఆన్ చేస్తే బోల్డంత ఇంధనం వృథా అవుతుంది’ అని కిషోర్ తన బాధను వ్యక్తంచేశాడు. కేంద్రం లాక్‌డౌన్ ప్రకటించడంతో స్వగ్రామం రాయ్‌గడ్ చేరుకోవడం కిశోర్‌కు కష్టమైంది.