స్నేహితుల మధ్య గొడవలు, ప్రేమికుల మధ్య మనస్పర్థలు, భార్యాభర్తల మధ్య అపార్ధాలు ఇలా సందర్భం ఏదైనా….ఇద్దరిలో ఒకరు ఇంకొకరిని హర్ట్ చేయడం, ఆ కోపంతో అవతలి వారిని దూరం పెట్టడం, వారితో పూర్తిగా మాట్లాడడం మానేయడం లాంటివి జరుగుతుంటాయి. అవతలి వాళ్ళు సారీ చెప్పినా కూడా ఒప్పుకోరు కొంతమంది. కానీ అలా మొండిగా ఉండడం మంచిది కాదంటున్నారు మానసిక నిపుణులు. దేనికైనా పట్టు విడుపులు ఉండాలని చెబుతున్నారు. ఇది మన మంచికే అని అంటున్నారు. మనం ఎంత మంచి వాళ్ళం అయినా…ఇలాంటి బిహేవియర్ మనల్ని దిగజారుస్తుందే తప్ప ఏమీ ఉపయోగం ఉండదు. అవతలి వాళ్ళు మనల్ని బాధపెట్టిన నిజమే అయినా….తప్పొప్పులు తెలుసుకున్నప్పుడు మనం అర్ధం చేసుకోవాలి. పెద్ద మనసు ఉంటే, మన్నించగలిగితే అందరికీ మనశ్శాంతిగా ఉంటుంది….అనుబంధాలూ నిలబెడతాయి.
ఆత్మ పరిశీలన:
మనల్ని మనకంటే ఎవరూ బాగా తెలుసుకోలేరు. మనలో మంచి ఏంటి, చెడు ఏంటి అనే విషయాలు మనకే ఎక్కువ తెలుస్తాయి. మనల్ని హర్ట్ చేసినవారిని మన్నించే క్రమంలో ఇవే కీలకం అంటున్నారు నిపుణులు. తను చేసిన పనివలన నా మనసు విరిగిపోయింది, నావల్ల కాదు అంటుంటారు చాలామంది. కానీ ఒక్కసారి మన గురించి మనం అవలోకనం చేసుకుంటే ఏ పనినైనా ఈజీగా చేసేయచ్చు. మన మనసులను, ఆలోచనలను పాజిటివిటీ వైపుకు మళ్ళించవచ్చు. మనం తలుచుకుంటే జరగనిపని అంటూ ఏదీ ఉండదు. మన్నించడం కూడా అంతే. సాలుకూల దృక్పథం అన్ని విషయాల్లోనూ చాలా మేలు చేస్తుంది.
అర్ధం చేసుకోండి:
పశ్చాత్తాపాన్ని మించిన ప్రయశ్చితం లేదంటారు. కాబట్టి ఎవరైనా మనల్ని సారీ అడిగితే వాళ్ళని విసుక్కోవద్దు. సమస్య ఎంత పెద్దది అయినా మాట్లాడుకుంటే పరిష్కారం ఉంటుంది. మనల్ని బాధ పెట్టడానికి ఎదుటివారు ఎందుకు అలా చేశారో కనుక్కోవాలి. వాళ్ళు చెప్పేది పూర్తిగా విన్నాక….ఇంకా ఏమైనా ఉంటే నిలదీయవచ్చును. దానివల్ల మనం ఎంత బాధ పడ్డామో వివరించవచ్చును. ఈ భావోద్వేగాలే ఇద్దరినీ దగ్గరకు చేరుస్తాయి.
కోపం ఎలాంటిది:
కోపంలో రెండు రకాలున్నాయి. కొంతమందికి కోపం వస్తే ఇట్టే కరిగిపోతుంది. కొన్ని నిమిషాలు ఉంటుంది తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంటారు. కానీ కొంత మందికి విపరీతమైన కోపం ఉంటుంది. రోజుల తరబడి ఆ కోపంలోనే ఉంటారు. దీనివల్ల వాళ్ళ సామాజిక బంధాల మీద ప్రభావం పడుతుంటుంది. దీర్ఘకాల కోసం మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే ఈ రెండింట్లో మీది ఏ తరహా కోపమో పరిశీలించుకోవాలి…ఎదుటివారి క్షమాపణను అంగీకరిస్తారో…లేదంటే సమస్యల్ని కొని తెచ్చుకుంటారో నిర్ణయించుకోవాలి.
కౌన్సెలింగ్:
కొంతమంది ఎదుటివారి తప్పును క్షమించినా, క్షమించకపోయినా ఎప్పుడూ దాని గురించే ఆలోచిస్తుంటారు. క్షమించి పొరపాటు చేశామా? వాళ్ళ దృష్టిలో చులకన అయ్యాయా అని తమన తామే నిందించుకుంటారు. ఎక్కడికెళ్ళినా, ఎవరితో మాట్లాడుతున్నా ఇదే ధ్యాసతో ఉంటూ అటు మానసికంగానూ, ఇటు శారీరకంగానూ నష్టపోతుంటారు. ఇలాంటి సమస్య ఉన్నవాళ్ళు వెంటనే మానసిక నిపుణుల దగ్గరకు వెళ్ళడం మంచిది. దానివల్ల సమస్య మరింత జటిలం అవ్వకుండా ఉంటుంది. స్వీయప్రేమ దీనికి మంచి మందు. సానుకూల దృక్పథం ఉంటే అన్ని విషయాలను పాజిటివ్ కోణంలో చూడగలుగుతాము. అనుబంధాల్ని కాపాడుకోగలుగుతాము కూడా.