ఆయన తెలుగు గడ్డపై పుట్టడం మన అదృష్టం: జగన్
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా పెద అమిరంలో ఈరోజు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. కాసేపటిక్రితమే అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. అనంతరం జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోదీని శాలువతో సత్కరించారు. ప్రధానికి విల్లంబు, సీతారాముల పటాన్ని బహూకరించారు.
జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.."ఒక మనిషిని ఇంకొక మనిషి, ఒక జాతిని మరొక జాతి, ఒక దేశాన్ని మరొక దేశం దోపిడీ చేయడానికి వీల్లేని సమాజాన్ని స్వాతంత్ర సమరయోధులు ఆకాంక్షించారు. అటువంటి సమయంలో అల్లూరి సీతారామరాజు ఒక అగ్నికణమై బ్రిటిష్ పాలకులకు ఎదురునిలిచారు. అంతటి విప్లవవీరుడు మన తెలుగు గడ్డపై పుట్టడం మనందరి అదృష్టం. తెలుగు జాతికే కాకుండా, యావత్ దేశానికి ఆయన ఒక స్ఫూర్తిప్రదాత. ఆయన ఘనతను గుర్తుంచుకోవడానికే ఆయన పేరుపై జిల్లాను ఏర్పాటు చేశాం. అల్లూరి చేసిన త్యాగం ప్రతి మనిషి గుండెలో చిరకాలం నిలిచిపోతుంది. ఆనాడు దేశ స్వాతంత్రం కోసం లక్షలాది మంది ప్రాణాలు అర్పించారు" అని ఆయన అన్నారు.
మరోపక్క ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగిసింది. బహిరంగ సభలో ప్రసంగం అనంతరం ప్రధాని మోదీ ప్రత్యేక హెలికాప్టర్‌లో గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలుదేరారు. అక్కడ నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకోనున్నారు.