ఫ్యాక్టరీ చెకింగ్‌కి మేం సిద్ధమే : అమర్‌రాజా బ్యాటరీస్ - MicTv.in - Telugu News
mictv telugu

ఫ్యాక్టరీ చెకింగ్‌కి మేం సిద్ధమే : అమర్‌రాజా బ్యాటరీస్

March 8, 2022

03

అమర్ రాజా బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి పెద్ద ఎత్తున కాలుష్యం వెలువడుతుందన్న ఆరోపణలకు సమాధానంగా.. తమ కంపెనీని ఎప్పుడైనా తనిఖీ చేయవచ్చని ఆ కంపెనీ స్పష్టం చేసింది. గతంలో కాలుష్యం కారణంగా ఏపీ పీసీబీ ఇచ్చిన పరిశ్రమ మూసివేత ఉత్తర్వులపై కంపెనీ హైకోర్టులో అప్పీలు చేసింది. సోమవారం పిటిషన్ విచారణ సందర్భంగా కంపెనీ తరపున న్యాయవాది ఆదినారాయణ రావు వాదనలు వినిపించారు. కంపెనీ ఉద్యోగుల రక్తంలో సీసం శాతం పరిమితంగానే ఉన్నట్టు గతంలో నిర్వహించిన పరీక్ష ఫలితాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పరిశ్రమ వ్యవస్థాపకులు కూడా కంపెనీ ప్రాంగణంలోనే నివసిస్తున్నారని తెలియజేశారు. ఈ విషయంలో పీసీబీ చేస్తున్న ఆరోపణలు సరికావని కోర్టుకు విన్నవించారు. అవసరమైతే, నిపుణులతో కూడిన కమిటీతో తమ సంస్థలో తనిఖీలు చేయవచ్చనీ, అందుకు తమకు అభ్యంతరం లేదన్నారు. మరోవైపు పరిశ్రమ నిర్వహణకు గతంలో ఇచ్చిన అంగీకార గడువు ఈ నెలతో ముగియనుండడంతో దానిని పునరుద్ధరిస్తూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోర్టు వారిని కోరారు. పీసీబీ తరపున సురేందర్ రెడ్డి వాదిస్తూ.. తనిఖీల కమిటీకి రిటైర్డ్ జడ్జి నేతృత్వం వహించాలని కోరారు. ఈ విషయంపై తమ సీనియర్ న్యాయవాది ఈ నెల 11న వాదనలు వినిపిస్తారనీ, అప్పటి వరకు కేసును వాయిదా వేయాలని కోరారు. దీంతో కోర్టు సంయుక్త తనిఖీ కమిటీని నియమిస్తామని చెప్పి తదుపరి విచారణను 11కు వాయిదా వేసింది. అలాగే, విచారణ జరుగుతుండగా, పదే పదే నోటీసులు ఇవ్వడం సరికాదని పీసీబీని మందలించింది.