మమ్మల్ని క్షమించండి: విఘ్నేశ్, నయనతార - MicTv.in - Telugu News
mictv telugu

మమ్మల్ని క్షమించండి: విఘ్నేశ్, నయనతార

June 11, 2022

“తిరుమలలోనే మా పెళ్లి చేసుకోవాలని ఎంతో కాలంగా అనుకున్నాం. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల మహాబలిపురంలో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. పెళైన వెంటనే మండపం నుంచి నేరుగా తిరుమలకు వచ్చి, స్వామివారి కల్యాణం వీక్షించి, ఆశీస్సులు తీసుకోవాలనుకున్నాం. అందుకే శుక్రవారం స్వామివారి దర్శనం చేసుకున్నాం. దర్శనం అయిన వెంటనే మా పెళ్లి ఇక్కడే జరిగింది అనే భావన మాలో కలిగేలా, ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఆలయ ఆవరణలో ఫొటోషూట్ చేసుకోవాలనుకున్నాం. కానీ, ఆ టైంలో భక్తులు ఎక్కువగా ఉండటం వల్ల వెళ్లిపోయి, కొద్దిసేపటికి తిరిగి అక్కడికి వచ్చాం. ఫొటోషూట్ వెంట వెంటనే పూర్తి చేయాలనే గందరగోళంలో మా కాళ్లకు చెప్పులు ఉన్నాయా లేదా అనే విషయాన్ని కూడా మేము మర్చిపోయాం. అంతేకాని, కావాలని వేసుకోలేదు. దేవుడిపై మాకు ఆపారమైన నమ్మకం ఉంది. మేము ఎంతగానో ఆరాధించే స్వామి వారిని అవమానించాలని అలా చేయలేదు. దయచేసి మమ్మల్ని క్షమించండి” అని విఘ్నేశ్ శివన్, నయనతార టీటీడీ యాజమాన్యాన్ని కోరారు.

ఇటీవలే నయనతార, విఘ్నేశ్ శివన్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా తిరుమల మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని తిరగడం, ఆలయ ఆవరణలో ఫొటోషూట్ చేసుకోవడం, సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయ్యాయి. దాంతో టీటీడీ యాజమాన్యం నయనతార ఆమె భర్త విఘ్నేశ్ శివన్‌పై మండిపడుతూ, చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో వివాదంపై వివరణ ఇస్తూ, శనివారం విఘ్నేశ్ శివన్ టీటీడీకి లేఖ రాశారు. ఫోటోషూట్ చేస్తున్న టైంలో తమ కాళ్లకు చెప్పులు ఉన్న సంగతి తమకు గుర్తులేదని, దేవుడిపై తమకు ఆపారమైన నమ్మకం, భక్తి ఉందని, తాము తెలియక చేసిన తప్పును క్షమించాలని వారు ఇద్దరు కోరారు.

మరోపక్క ‘శ్రీవెంకటేశ్వరస్వామి కొలువు తీరిన ప్రాంతంలో ఉన్న మాడవీధులు అత్యంత పవిత్రమైనవి. మాడవీధుల్లో చెప్పులు వేసుకుని నడవడం నిషేదం. నయనతార ఇలా చెప్పులు వేసుకుని తిరిగినందుకు స్వామి వారిని క్షమాపణ కోరండి’ అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. దాంతో స్పందించిన నయనతార భర్త విఘ్నేశ్ క్షమాపణలు కోరుతూ, లేఖను విడుదల చేశారు.