మేం ఉడతలం, కేసీఆర్ బెదిరిస్తున్నాడు.. అశ్వత్థామరెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

మేం ఉడతలం, కేసీఆర్ బెదిరిస్తున్నాడు.. అశ్వత్థామరెడ్డి

October 30, 2019

Aswaththama Reddy.

రోజురోజుకూ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె మరింత ఉదృతం అవుతుందే తప్ప తగ్గడం లేదు. ప్రభుత్వ మొండి వైఖరి మానుకుని తమ డిమాండ్లను నెరవేర్చే వరకు తమ సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ కార్మిక సంఘాలు అంటున్న విషయం తెలిసిందే. సమ్మెతో తమకు ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా గమ్యాన్ని చేరాల్సిందేనని ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి తెలిపారు. 

సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహించిన సకల జనభేరి సభలో అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ.. ‘తెలంగాణ కోసం కులమతాలకు అతీతంగా అందరూ ఉద్యమం చేశారు. మేము కూడా పాల్గొన్నాం. రామాయణంలో ఉడత రామునికి దారి చూపించకుంటే రామాయణమే లేదు. మేం ఉడతలాంటి వాళ్లం. మమ్మల్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ బెదిరించారు.. భయపెట్టారు. జీతాలు ఇవ్వకున్నా ఏ ఒక్క కార్మికుడూ వెనక్కి తగ్గలేదు’ అని అశ్వత్థామ రెడ్డి అన్నారు.  

తమకు కావాల్సింది ఆర్టీసీ పరిరక్షణ.. ప్రజా పరిరక్షణ అని ఆర్టీసీ ఐకాస కో కన్వీనర్‌ రాజిరెడ్డి స్పష్టంచేశారు. యూనియన్లను మూసివేయాలనుకుంటే.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరిక కూడా నెరవేరుతుందని రాజిరెడ్డి అన్నారు. కాగా, నేటితో ఆర్టీసీ కార్మికుల సమ్మె 26వ రోజుకు చేరుకుంది.