రోజువారీ ఆహారంలో మన భారతీయ వంటకాలు ప్రత్యేకం. చట్నీ, కెచప్.. ఇలాంటివి మనం రోజూ లాగించేస్తాం. ప్రత్యేకమైన వంటకాలు కూడా ఉంటాయి. అలాంటివి కొన్ని విదేశాల్లో నిషేధించారు. భారతదేశంలోని ప్రజలు ఆహార ప్రియులు. రోజుకో కొత్త వంటకం చేసి ప్రపంచానికి పరిచయం చేస్తుంటారు. అవి విదేశాల్లో సైతం ప్రాచుర్యం పొందుతున్నాయి. అయితే కొన్ని దేశాలు మన ఆహార పదార్థాలు వాస్తవానికి ఇతర దేశాల్లో నిషేధించబడ్డాయి. ఆ ఆహారాలేంటో చదవండి.
సమోసాలు :
భారతదేశంలోనే కాదు.. లండన్‌లో కూడా వీటికి ఆదరణ పెరిగింది. సమోసాలంటే.. మన దగ్గర అల్పాహారంగా అన్ని వయసుల వారు ఆనందిస్తారు. ఆలూ, ఆనియన్ ఇలా ఏ స్టఫ్ ఉన్నకూడా హాంఫట్ చేసే స్నాక్ ఇది. అయితే దక్షిణాఫ్రికా ప్రాంతంలోని సోమాలియాలో 2011 నుంచి సమోసాల వినియోగం నిషేధించబడింది. త్రిభుజాకార ఆకారం క్రైస్తవ మతానికి చిహ్నంగా ఉందని అల్ షబ్ గ్రూపు దీన్ని నిషేధించింది. సోమాలియాలో ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు పడుతాయి.
కెచప్
భారతదేశంలో సమోసాల నుంచి శాండ్విచ్ల వరకు దాదాపు అన్నింటితో కెచప్‌ను జత చేస్తారు. కొందరు దీనిని పిజ్జాలపై కూడా ఉండాల్సిందే! అయితే ఫ్రాన్స్‌లో కెచప్ వాడకం పరిమితం చేయబడింది. ఫ్రెంచ్ ప్రభుత్వం యువకుల్లో కెచప్ అధిక వినియోగాన్ని గుర్తించింది. ఆరోగ్య కారణాల కోసం పాఠశాల క్యాంటీన్లలో దాని వినియోగాన్ని నిషేధించింది. అయితే దీనికి అసలు కారణం.. ఫ్రెంచ్ ఆహార సంస్కృతి అమెరికీకరణ కాకుండా కాపాడాలని ఈ పని చేస్తున్నారు. అయితే.. ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్‌తో కెచప్ తినవచ్చని ఈ చట్టానికి సవరణ ఇచ్చారు.
చ్యవన్ ప్రాష్
భారతదేశంలో పిల్లలకు, పెద్దలకు ఉదయం పూట ఒక చెంచా చ్యవన్ ప్రాష్ని తినిపించడం అలవాటు. ఈ శీతాకాలంలో ఇంకా కచ్చితంగా ఉండాలి. ఇది శతాబ్దాలుగా ఉపయోగించబడుతున్న సాంప్రదాయ భారతీయ ఆహార సప్లిమెంట్. పండ్లు, మూలికలు, నెయ్యి మిశ్రమంతో తయారు చేయబడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచే ఆరోగ్యకరమైన పోషకాలతో నిండి ఉంటుందని నమ్ముతారు. అయితే.. కెనడాలో చ్యవన్ ప్రాష్ అమ్మకం, పంపిణీ 2005 నుంచి నిషేధించబడింది. ఉత్పత్తిలో అధిక స్థాయిలో సీసం, పాదరసం ఉన్నందుకు నిషేధిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం పేర్కొంది.
నెయ్యి
భారతీయ వంటకాల్లో నెయ్యి ప్రధానమైంది. చిన్న పిల్లలకు మొదటి ముద్ద దీనితోనే పెట్టాలంటారు పెద్దలు. ముఖ్యమైన పోషకాలను కలిగి ఉండే సూపర్ ఫుడ్‌గా దీన్ని అభివర్ణిస్తారు. వంటకాల్లోనే కాదు.. మతపరమైన ఆచారాల్లోనూ నెయ్యి వాడకం ఎక్కువగానే ఉంటుంది. అయితే.. అమెరికాలో మాత్రం నెయ్యి నిషేధిత ఉత్పత్తి. దీనివల్ల రక్తపోటు, గుండెపోటు, ఊబకాయం వంటి వ్యాధులకు కారణమవుతుందని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కనుగొంది.
చూయింగ్ గమ్
భారతదేశ:లో రోడ్డు పక్కన పాన్ దుకాణాల్లో.. కిరాణా దుకాణాల్లో చూయింగ్ గమ్ సులభంగా దొరుకుతుంది. దీన్ని కొందరు మౌత్ ఫ్రెషనర్ గా ఉపయోగిస్తారు. కొందరు చిన్నపిల్లల్లా మారి.. బెలూన్లను తయారు చేస్తుంటారు. అయితే.. సింగపూర్ లో పరిశుభ్రతను నిర్వహించడానికి కఠినమైన మార్గదర్శకాలున్నాయి. వాటిలో చూయింగ్ గమ్ అమ్మకం, వినియోగాన్ని నిషేధించింది. 1992లో దేశం అన్ని రకాల చూయింగ్ గమ్ ల వినియోగం, పంపిణీ, వ్యాపారాన్ని పరిమితం చేసింది. అయితే అంతర్జాతీయ ఒత్తిడి కారణంగా.. 2004లో దంత చికిత్స కోసం ఉపయోగించే చూయింగ్ గమ్‌లను అనుమతించింది.