నామీదొట్టు నవ్వకుండా ఉండలేరు: దేవీశ్రీ ప్రసాద్ - MicTv.in - Telugu News
mictv telugu

నామీదొట్టు నవ్వకుండా ఉండలేరు: దేవీశ్రీ ప్రసాద్

May 24, 2022

టాలీవుడ్ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ ‘ఎఫ్ 3’ సినిమా విషయంలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘ఎఫ్ 3’ ఈ నెల 27వ తేదీన థియేటర్లలో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. తాజాగా దేవీశ్రీ ప్రసాద్ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. “అనిల్ రావిపూడికి కామెడీపై మంచి పట్టుంది. ప్రతి పాత్రను ఆయన డిజైన్ చేసే తీరు చాలా బాగుంటుంది. వెంకటేశ్ బాడీ లాంగ్వేజ్‌తో యాక్ట్ చేసి చూపిస్తారు. వరుణ్ తేజ్ విషయంలో ఆర్ఆర్ చేస్తున్నప్పుడు నేను నవ్వు ఆపుకోలేకపోయాను. ఈ సినిమాను చూసిన ప్రతి ప్రక్షకుడు నవ్వకపోతే నా మీదొట్టు. ఈ సినిమా చూస్తుంటే ఒక జంధ్యాల, ఒక ఈవీవీ గుర్తుకు రావడం ఖాయం” అని ఆయన అన్నారు.

ఇక, ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే సామాజిక మాధ్యమాల వేదికగా ట్రైలర్, పాటలు విడుదలై, మంచి టాక్‌ను సొంతం చేసుకున్నాయి. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఆ ఈవెంట్‌లో నటుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ..”ఈ సినిమాలో చాలా పాత్రలు ఉన్నాయి. ప్రతి ఒక్కరి పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది. అందరూ పోటీపడి మరీ చేశాం. ఈ మధ్య కాలంలో ఇంతలా నాన్ స్టాప్‌గా నవ్వించిన సినిమా రాలేదంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చలేదటే మళ్లీ నేను కనిపించను” అంటూ సవాల్ చేశారు. ఈ క్రమంలో దేవీశ్రీ ప్రసాద్ సైతం ‘ఎఫ్ 3’ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు పడిపడి నవ్వుతారు అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి. చూడాలి మరి ఈ నెల 27న ప్రేక్షకులను ‘ఎఫ్ 3’ ఎలాంటి వినోదాన్ని అందిస్తుందో.