రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంగా ప్రకటించే ఉచిత పథకాల హామీలను అరికట్టే అధికారం తమకు లేదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. వివరాలు.. దేశ ఆర్ధిక వ్యవస్థకు ప్రమాదకరంగా మారుతున్న ఉచిత పథకాలను ప్రకటించే రాజకీయ పార్టీల వైఖరిపై బీజేపీ నేత, న్యాయవాది అశ్విన్ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో కేసు వేశారు. అలా ప్రకటించే రాజకీయ పార్టీత రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని పిటిషన్లో కోరారు. దీనిపై స్పందన తెలియజేయాలని సుప్రీంకోర్టు ఈసీని ఆదేశంచింది. ఈ నేపథ్యంలో ఈసీ కోర్టుకు అఫిడవిట్ సబ్మిట్ చేసింది. ఈ సందర్భంగా ‘ఎన్నికల్లో గెలిచిన పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. అనంతరం వాటి విధానాలను, నిర్ణయాలను ప్రశ్నించే అధికారం ఈసీకి లేదు. చట్టంలో ఇందుకు ఎలాంటి నిబంధనలు లేవు. ఒకవేళ మేం అలా ప్రవర్తిస్తే.. చట్టాన్ని అతిక్రమించినట్టు అవుతుంది. రాజకీయ పార్టీలు ప్రకటించే పథకాలు ఆచరణ సాధ్యమా? కాదా? ఆర్ధిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? అనే అంశాలు ఓటర్లే ఆలోచించుకోవాలి’ అని పేర్కొంది. వీటిని అరికట్టాలంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేయవచ్చని సూచించింది.