తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నేడు జరిగిన ఘటనకు, ఎన్ఎస్యూఐకి ఎటువంటి సంబంధం లేదని.. టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు వెంకట్ స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియోను విడుదల చేశారు.
ఆ వీడియోలో వెంకట్ మాట్లాడుతూ…”ఏదైయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో ఈరోజు ఘటన జరిగిందో, ఆ ఘటనకు సంబంధించి అగ్నిపథ్ పరీక్షకు ఆప్లై చేసుకున్న అభ్యర్థులు పరీక్ష రద్దు కావడంతో 48 గంటల్లో 44 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆ బాధ, ఆ ఆవేదనతోనే ఈరోజు ఈ ఘటన చేశారు. కానీ, ఈ ఘటన చేసింది ఎన్ఎస్యూఐ అనే కథనాలు వస్తున్నాయి. ఈ ఘటనకు మాకు ఏలాంటి సంబంధం లేదు. ఈ దాడి వెనక ఎన్ఎస్యూఐ కార్యకర్తలు ఎవరు లేరు. ఈరోజు నేను ఓ ఇంటర్వ్యూకు వెళ్తుండగా, పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. మీ అందరికీ స్పష్టత ఇవ్వడానికే పోలీసు స్టేషన్ నుంచి ఈ వీడియో చేస్తున్నాను” అని ఆయన అన్నారు.
మరోపక్క ఆందోళనకారులను అదుపు చేసే క్రమంలో పోలీసులు కాల్పులు జరుపగా, ఓ వ్యక్తి మృతి చెందగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో నాంపల్లి రైల్యే స్టేషన్ను అధికారులు పూర్తిగా బంద్ చేశారు. ఈ ఘటనతో ఏపీ, తెలంగాణలోని అన్నీ రైల్యే స్టేషన్లో పోలీసులు పహరా కాస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. పోలీసులు, ఆర్మీ రంగంలోకి దిగింది.