ఇప్పటికీ మనం జంతువుల్లానే ఉన్నాం.. ఢిల్లీ అల్లర్లపై దర్శకుడు - MicTv.in - Telugu News
mictv telugu

ఇప్పటికీ మనం జంతువుల్లానే ఉన్నాం.. ఢిల్లీ అల్లర్లపై దర్శకుడు

February 27, 2020

Anubhav Sinha

మనుషులు ఇంకా ఒకప్పటి జంతువుల్లానే ప్రవర్తిస్తున్నారని ఢిల్లీ అల్లర్లపై బాలీవుడ్ సంచలన దర్శకుడు అనుభవ్ సిన్హా వ్యాఖ్యానించారు. ఆయన తాజాగా దర్శకత్వం వహించిన ‘థప్పడ్’ సినిమా ప్రమోషన్‌లలో భాగంగా ఆయన మీడియా ఇంటర్వ్యూలో సీఏఏకు వ్యతిరేకంగా, మద్దతుగా ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లపై ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఈరోజు ఉదయం కొన్ని వీడియోలు చూశాను. ఆ వీడియోల్లో మనుషులు జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు. అదిచూసి మనం ఒకప్పుడు జంతువులం, బహుశా ఇప్పటికీ అలానే ఉన్నాం అని అనిపించింది. చాలామంది నన్ను చాలా కఠినంగా మట్లాడతానని అంటారు. కానీ, నేను చాలా నిజాయితీగా ఉండాలనుకుంటాను.. అందుకే నిజం మాట్లాడితే చేదుగా, కఠినంగా అనిపిస్తుంది’ అని అనుభవ్ సిన్హా అన్నారు. 

ఇది నా దేశం దీనిని ప్రశాంతంగా, పరిశుభ్రంగా, జీవించడానికి యోగ్యంగా నా భావితరాలకు అందించే బాధ్యత తనపై ఉందని స్పష్టంచేశారు. అలాంటి ఈ దేశంలో ఏమైనా తప్పు జరిగితే దానిని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలిపారు. కాగా, ఇటీవల అనుభవ్ సిన్హా మానవ హక్కుల నేపథ్యంలో తీసిన ముల్క్, ఆర్టికల్ 15 సినిమాలు బాక్సాఫీస్ వద్ద విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు బాలీవుడ్‌లో వివాదాస్పద కథాంశాలతో సినిమాలు తెరకెక్కించే దర్శకుడిగా ముద్ర పడింది. తాజాగా ఆయన రూపొందించిన ‘థప్పడ్’ సినిమా స్త్రీలపై జరిగే గృహ హింస నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రంలో కూడా తాప్సీ పన్ను కథానాయికగా నటించింది.