We will complete Polavaram regardless of Telangana: BJP MP
mictv telugu

తెలంగాణ ఒప్పుకోకపోయినా పోలవరం పూర్తి చేస్తాం : బీజేపీ ఎంపీ

July 21, 2022

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి ఉప్పొంగి ప్రమాదకర స్థాయిలో వరద ప్రవహించడం తెలిసిందే. దీంతో భద్రాచలం సహా చుట్టుపక్కల మండలాల్లో పలు కాలనీలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పోలవరం ఎత్తు పెంచాలని నిర్ణయించింది. దీంతో తెలంగాణ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. పోలవరం వల్ల లక్ష ఎకరాలతో పాటు భద్రాచలం, పర్ణశాల మునిగిపోతుందని, పోలవరం కోసం ఏపీకి ఇచ్చిన ఏడు మండలాలను తిరిగి వెనక్కి ఇచ్చేయాలని టీఆర్ఎస్ నాయకులు ఇటీవల అభిప్రాయపడ్డారు. దాంతో ఈ వివాదం ఇరు రాష్ట్రాల అధికార పార్టీల నేతల మధ్య మాటల తూటాలకు కారణమైంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించారు. విభజన సమయంలోనే పోలవరం ప్రాజెక్టుకు తెలంగాణ ఒప్పుకున్నట్టు చట్టంలో ఉందని పేర్కొన్నారు. ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్న ముంపు సమస్యను రాజకీయ అభ్యంతరాలుగానే చూస్తామని స్పష్టం చేశారు. అటు వరదల వల్ల జరిగిన నష్టాన్ని పార్లమెంటులో కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.