కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలపై సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. అన్ని వర్గాల నుంచి వచ్చిన డిమాండ్‌తోనే ప్రభుత్వం పేరు మార్చిందని ఆయన వెల్లడించారు. మంగళవారం ఈ అంశంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ‘విస్తృత డిమాండ్ రావడంతో అంబేద్కర్ పేరు పెట్టాం. అందరి ఆమోదం ఉంది కాబట్టి ఈ సమస్య పరిష్కరించలేనిది కాదు.
ఉద్రిక్త పరిస్థితుల వెనుక ఏ శక్తులు ఉన్నాయో కనిపెడతాం. ఓ మహానేత పేరు పెడితే పునరాలోచించాల్సిన అవసరం ఏముంది. మా పార్టీకి కూడా వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. రెచ్చగొట్టడం ఎవరు చేసినా తప్పే. అంబేద్కర్ లాంటి మహనీయుడికి దురుద్దేశాలు ఆపాదించడం సరికాదు. అన్ని వర్గాలతో చర్చలు జరుపుతాము. దానికంటే ముందు అందరూ సంయమనం పాటించాలి’ అని వెల్లడించారు. ఇదిలా ఉండగా, తన ఇంటిని తగులబెట్టడంపై మంత్రి విశ్వరూప్ స్పందించారు. ‘నా ఇంటిని తగులబెట్టడం దురదృష్టకరం. అంబేద్కర్ పేరు పెట్టాలని బీజేపీ, జనసేన, టీడీపీలు డిమాండ్ చేశాయి. జనసేన అయితే నిరసనలు కూడా చేసింది. తీరా పేరు మార్చిన తర్వాత ఇప్పుడు కార్యకర్తలను రెచ్చగొట్టి అల్లరి చేస్తున్నారు. అంబేద్కర్ పేరును వ్యతిరేకించడం సరికాద’ని అభిప్రాయపడ్డారు.