బీజేపీలోకి 277 మంది ఎమ్మెల్యేలు.. రూ. 5,500 కోట్లు : కేజ్రీవాల్
ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. సోమవారం అసెంబ్లీలో తమ ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కొంటుందని వెల్లడించారు. ఢిల్లీ అసెంబ్లీ శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమవగా, ఆపరేషన్ లోటస్ దారుణంగా విఫలమైందని రుజువు చేసేందుకు విశ్వాస పరీక్ష నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీపై కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. ఒక్కో ఆప్ ఎమ్మెల్యేకు బీజేపీ రూ. 20 కోట్లను 40 మందికి ఇవ్వజూపిందని, కానీ బీజేపీ అనుకున్నట్టు జరగలేదని అన్నారు. ఢిల్లీలో ఆపరేషన్ కమలం కాస్తా ఆపరేషన్ బురద అయిందని సెటైర్లు వేశారు. దేశవ్యాప్తంగా 277 మంది ఎమ్మెల్యేలను బీజేపీని కొనుగోలు చేసిందని, ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 కోట్ల చొప్పున ఆ మొత్తం లెక్కించి చూస్తే రూ. 5,500 కోట్లవుతుందని వివరించారు. జీఎస్టీ, చమురు ధరల పెంపు వల్ల వచ్చిన డబ్బును బీజేపీ ఇలా వాడుకుందనీ, దీని వల్ల దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిందంటూ చెప్పుకొచ్చారు. గుజరాత్ ఎన్నికల వరకు తమపై బీజేపీ తప్పుడు కేసులు పెడుతూనే ఉంటుందని, సీరియల్ కిల్లర్‌లా దేశంలోని రాష్ట్రాల్లో వరుస ఖూనీలు చేసుకుంటూ వస్తోందని ధ్వజమెత్తారు.