Home > Featured > మేమొస్తే ఆ రాష్ట్రాలన్నింటికి ప్రత్యేక హోదా.. నితీశ్

మేమొస్తే ఆ రాష్ట్రాలన్నింటికి ప్రత్యేక హోదా.. నితీశ్

బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్ గురువారం సంచలన ప్రకటన చేశారు. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీయేతర కూటమి గెలిస్తే దేశంలోని అన్ని వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పిస్తామని ప్రకటించారు. హోదా ఇవ్వకపోవడానికి ప్రత్యేక కారణాలేమీ ఉండవని పాట్నాలో వెల్లడించారు. తాము 2007 నుంచి అడుగుతున్నా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ప్రత్యేక హోదా నిరాకరించారని గుర్తు చేశారు. అత్యంత వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చి వాటిని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, బీజేపీయేతర కూటమిని ఒక్కతాటిపైకి తేవడానికి నితీష్ ప్రయత్నాలు ప్రారంభించారు.

ఇప్పటికే అన్ని పార్టీల నేతలను కలిసిన నితీష్.. త్వరలో సోనియాగాంధీతో సమావేశం కానున్నారు. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కూడా అన్ని పార్టీల కీలక నేతలతో సమావేశమయ్యారు. ప్రస్తుత బీజేపీ సారధ్యంలోని కేంద్రం రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతోందని వీరిద్దరూ ఇప్పటికే ఆరోపణలు చేశారు. కానీ, ఈ విపక్ష కూటమిలోకి కాంగ్రెస్ ఉంటుందా? లేదా? అనేది పెద్ద ప్రశ్న. ఈ విషయంలో ఇంతవరకు ఎలాంటి స్పష్టత రాలేదు. అలాగే ఒకవేళ బీజేపీయేతర ప్రభుత్వం గనుక అధికారంలోకి వస్తే ప్రధానమంత్రి అభ్యర్ధి ఎవరనేది మిలియన్ డాలర్ల సందేహం. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అంటూ నితీష్, దేశంలోని రైతులందరికీ ఉచిత కరెంట్ హామీతో కేసీఆర్ ప్రకటించడంతో పోటీలో మేమున్నామంటూ సంకేతాలు పంపినట్టయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Updated : 15 Sep 2022 6:35 AM GMT
Tags:    
Next Story
Share it
Top