కొత్త రాజధాని శంకుస్థాపనకు ప్రధానిని పిలుస్తాం.. బొత్స  - MicTv.in - Telugu News
mictv telugu

కొత్త రాజధాని శంకుస్థాపనకు ప్రధానిని పిలుస్తాం.. బొత్స 

August 13, 2020

We will invite the PM modi for the foundation stone of the new capital .. Botsa.

ఏపీలో కొత్త రాజధాని శంకుస్థాపను ప్రధాని మోదీని ఆహ్వానిస్తున్నట్టు రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. శాసన సభ ఆవరణలో గురువారం శాసన మండలి అభ్యర్ధి పెనుమత్స సూర్యనారాయణ రాజు నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రాష్ట్రంలో శుభకార్యాలు జరిగేటప్పుడు అందరికీ చెప్పి చేయడం హిందూ సాంప్రదాయమని మంత్రి వివరించారు.ఈ కార్యక్రమానికి దేశ ప్రధానమంత్రిని,  దేశంలోని పెద్దలను అందరినీ పిలుస్తామని అన్నారు.అన్ని రాష్ట్రాల వారికి ఆహ్వాన పత్రాలను అందజేస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి మెట్రో పాలిటిన్‌ ఏరియా డెవలప్‌ అథారిటీ (ఏఎంఆర్డిఏ) అంశంపై సమీక్ష నిర్వహించారని అన్నారు. అమరావతిలో ప్రస్తుతం ఏయే దశల్లో నిర్మాణాలు ఉన్నాయో అధికారులను సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారని చెప్పారు. నిధుల సమీకరణకు ప్రణాళిక సిద్ధంచేసుకోవాలని, ఆర్థికశాఖ అధికారులతో కలిసి కూర్చుని ప్లాన్‌ చేసుకోవాలని జగన్ ఆదేశించారని వివరించారు. 

ఇక అమరావతి ప్రాంతం రాష్ట్రంలో అంతర్భాగమని.. దానిని కూడా అభివృద్ధి చేసి చూపుతామని పేర్కొన్నారు. మరోవైపు హాపీ నెస్ట్‌ బిల్డింగులను పూర్తిచేయాలని.. వాటిని పూర్తిచేసే కార్యాచరణపై అధికారులతో సీఎం చర్చించినట్లు మంత్రి బొత్స వెల్లడించారు.
‘ప్రభుత్వం మూడు రాజధానుల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తుంది. అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృషి చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రైతులకు రిటన్ ప్లాట్లు ఇచ్చి ఆభివృద్ధి చేస్తాం. సీఆర్డిఏ చట్టం రద్దును, పరిపాలన వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదించాకే శంఖు స్థాపన చేయాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ప్రతిపక్షాలు కోర్టు ద్వారా ప్రభుత్వ చర్యలకు అడ్డంకులు సృష్టిస్తున్నాయి. అమరావతిలో నిర్మాణ దశలో అసంపూర్తి భవనాలను పూర్తి చేస్తాం. ఈ ప్రాంత రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రజలందరికీ నమ్మకం కలిగేలా అమరావతిని అభివృద్ధి చేసి చూపుతాం. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షం మొత్తం మేమే. చంద్రబాబు ప్రతిపక్ష బాధ్యతను విస్మరించారు. ప్రతిపక్షం మాటలను నమ్మవద్దు.. లేనిపోని అనుమానాలను పెట్టికోవద్దు’ అని మంత్రి బొత్స తెలిపారు.