దేశంలో వంట గ్యాస్ ధరలు పెరుగుతున్న కొద్దీ సామాన్యులకు పెనుభారంగా మారుతోందని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాత్ అభిప్రాయపడ్డారు. ఆ భారాన్ని దించేందుకు తమ ప్రభుత్వం వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి గ్యాస్ సిలిండర్ ని రూ. 500కే అందిస్తామని ప్రకటించారు. అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన ఈ మేరకు వెల్లడించారు.
అయితే ఈ పథకం అందరికీ వర్తించదు. ఉజ్వల యోజన పథకం కింద నమోదు చేసుకున్న వారికి మాత్రమేనని మెలిక పెట్టారు. ‘ఉజ్వల పథకం కింద ప్రధాని మోదీ కేవలం గ్యాస్ కనెక్షన్, స్టౌవ్ ఇచ్చారు. కానీ సిలిండర్లు ఖాళీగా ఉన్నాయి. దీనికి అధిక ధరలే కారణం. దీన్నుంచి ఉపశమనం పొందడం కోసం ఏప్రిల్ 1 నుంచి సిలిండర్ ని రూ. 500 కే అందిస్తాం. ఇలా ఏడాదికి 12 సిలిండర్లకు వర్తింపజేస్తామ’ని వివరించారు. కాగా, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రజలకు ముఖ్యమంత్రి ఈ ఆఫర్ ప్రకటించారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.