తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ (అసిస్టెంట్ ప్రొఫెసర్) పోస్టుల భర్తీ విషయంలో మంగళవారం కేసీఆర్ కీలక విషయాలను వెల్లడించారు. ప్రగతి భవన్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ..” తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలలో మొత్తం మూడున్నర వేలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలను ఎవరికి వాళ్లే భర్తీ చేయటంలో కొన్ని రకాల ఇబ్బందులు, కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. వేరే రాష్ట్రాలను పరిశీలించినప్పుడు ఒక కామన్ బోర్డ్ విద్యాశాఖ ఆధ్వర్యంలో పెట్టి, రిక్రూట్మెంట్ చేసి ఏ యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ఎంతవరకు అవసరమో తెప్పించుకోని, ఆ ప్రకారం పుల్ఫిల్ చేస్తారు. లేకపోతే పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా గాని, ఇతర మెకానిజం ద్వారా గాని ఆ రిక్రూట్మెంట్ ద్వారా ఆయా శాఖలకు కావాల్సిన ఉద్యోగులను అలర్ట్ చేస్తారు. ఆ రకంగానే తెలంగాణలో కూడా ఏ ఇబ్బంది లేకుండా అవి జరిగిపోతాయి” అని కేసీఆర్ అన్నారు.
మరోపక్క గతకొన్ని రోజుల క్రితం యూనివర్సిటీలకు తొలిసారిగా ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించి, అందులో అత్యధిక మార్కులు సాధించిన వారికి ఇంటర్య్వూలు నిర్వహించి, ఆ పోస్టులను భర్తీ చేస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ రిక్రూట్మెంట్కు సంబంధించిన పరీక్షను నిర్వహించే బాధ్యతను కూడా టీఎస్పీఎస్సీకి అప్పగించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రరెడ్డి ఆయా యూనివర్సిటీల వీసీలతో, రిజిస్ట్రార్లతో, సీనియర్ అధ్యాపకులతో చర్చలు జరిపారు. ఇటువంటి సమయంలో కేసీఆర్ యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల నియమాల విషయంలో కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వివరంగా చెప్పారు.