ఫిబ్రవరి నెలాఖరులోపు పోడు బూములు పంపిణీ ప్రారంభిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన పోడు భూములపై బీఆర్ఎస్కు ప్రత్యేక విధానం ఉందని స్పష్టం చేశారు. అన్ని పార్టీల నేతలు ఒప్పుకుంటే 11.5 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇస్తామని తెలిపారు. పట్టాలు ఇచ్చాక గిరిజనులు గజం భూమినీ కూడా ఆక్రమించబోమని ప్రభుత్వానికి హామీ ఇవ్వాలని కేసీఆర్ కోరారు. భూమిని ఆక్రమిస్తే పోడు పట్టాలు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఇక అటవీ ప్రాంతాల్లో ఒక్క చెట్టూ కూడా కొట్టడానికి వీల్లేదన్నారు.
భూములు పంపిణీ చేశాక రైతుబంధు, విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పిస్తామని సీఎం తెలిపారు. విచక్షణరహితంగా అడవులను నరికివేయడం సరికాదని సూచించారు. భూమిలేని గిరిజన బిడ్డలకు గిరిజన బంధు ఇచ్చి సాయం చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా గిరిజనులపై పోలీసులు, అటవీ అధికారులు దాడులు చేయొద్దని ఆదేశించారు. ఆదే సమయంలో అధికారులపైనా కూడా గిరిజనులు దాడులు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గిరిజనులను గత పాలకులు మోసం చేశారని విమర్శించారు. పోడు, అటవీ భూములు పలువురికి ఆటవస్తువులా తయారయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.