ఆయుధాలు వదిలిపెడితే యుద్ధం ఆపుతాం: రష్యా - MicTv.in - Telugu News
mictv telugu

ఆయుధాలు వదిలిపెడితే యుద్ధం ఆపుతాం: రష్యా

February 25, 2022

vvvv

రష్యా – ఉక్రెయిన్‌ దేశాల మధ్య రెండు రోజులుగా భీకర యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. యుద్ధంతో ఉక్రెయిన్ దేశ ప్రజలు భయంతో వణికిపోయి, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. యుద్ధం ఎప్పుడెప్పుడు ఆగిపోతుంది అని ఎదురుచూస్తున్న నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీలారోవ్ కీలక ప్రకటన చేశారు. ‘ఉక్రెయిన్ సైన్యం ఆయుధాలు వదిలిపెడితే, చర్చలకు మేము సిద్దం’ అని వెల్లడించారు. అందుకు సంబంధించిన ఓ ప్రకటనను విడుద‌ల చేశారు.

ఆ ప్రకటనలో “ఉక్రెయిన్ సైన్యం త‌క్ష‌ణ‌మే పోరాటం ఆపాలి. మీ చేతుల్లోని ఆయుధాల‌ను వ‌దిలేయాలి. ఆపై ర‌ష్యా సైన్యానికి లొంగిపోవాలి. మొత్తంగా ఉక్రెయిన్ సైన్యం మాకు స‌రెండ‌ర్ అయిపోతేనే, మీ ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జరపడానికి మేము సిద్ధ‌ాం” అని పేర్కొనాడు. ఈ ప్ర‌క‌ట‌న‌తో ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు ఒప్పుకుంటారా లేక యుద్ధాన్ని కొనసాగిస్తారా అనేది ఉత్కంఠ రేపుతుంది.

మరోపక్క ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ దేశ ప్రజలను ఉద్దేశించి శుక్రవారం ఉదయం ఆయన మాట్లాడుతూ “నేను దేశం విడిచిపారిపోయానని వదంతులు వస్తున్నాయి. నేనెక్కడికీ పారిపోలేదు. యుద్ధంలో ఒంటరైపోయాం. మనతో కలిసి యుద్ధం చేయడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? నాకు ఎవరూ కనిపించట్లేదు” అని భావోద్వేగానికి గురైన సంగతి తెలిసిందే.