విజయవాడ అత్యాచార బాధితురాలి పరామర్శ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ నేత బోండా ఉమలు తనతో ప్రవర్తించిన తీరుకు మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ నోటీసిచ్చిన విషయం తెలిసిందే. బుధవారం రోజు కమిషన్ ముందు హాజరవ్వాలని నోటీసులో పేర్కొనగా, చంద్రబాబు, ఉమలు ఇద్దరూ హాజరుకాలేదు. దీంతో వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. బుధవారం విజయవాడలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చట్టపరంగా ముందుకెళ్లే అంశంపై న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
బాధిత మహిళల పట్ల ఎలా వ్యవహరించాలో చెప్పేందుకు వారికి నోటీసులిచ్చామని, విచారణకు రాకపోవడంతో చర్యలకు ఉపక్రమిస్తున్నట్టు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నైతిక విలువలు లేకుండా ప్రవర్తించారని విమర్శించారు. అలాగే కమిషన్ కార్యాలయం వద్ద నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు నిర్వహించడం సరికాదని అభిప్రాయపడ్డారు.