2023కి ఐఎమ్డీ మొదటి హీట్ వార్నింగ్ ఇచ్చేసింది. దీని గురించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజలకు రక్షణ కల్పించాలంటూ ఒక ప్రకటన కూడా జారీ చేసింది.
శివరాత్రి రోజున ‘శివ.. శివ..’ అంటూ చలిపోతుందంటారు. మెల్లగా వేడి తాపం మనల్ని తాకాలి. కానీ అప్పుడే మండుతున్న ఎండలు మనల్ని కాల్చేస్తున్నాయి. అందుకే వేడి సంబంధిత అనారోగ్యం పై జాతీయ కార్యచరణ ప్రణాళికలో భాగంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు.. వీలైనప్పుడల్లా తగినంత నీరు తాగాలని భారతీయులను కోరారు.
గత సంవత్సరం భారతదేశం 122 సంవత్సరాల్లో లేనంత ఉష్ణోగ్రతను నమోదు చేసింది. ఈ సంవత్సరం అంతకుమించి కూడా ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి. ఈ తీవ్రమైన హీట్ వేవ్స్ ని కాపాడుకోవాలంటే కొన్ని సూచనలు పాటించాలని ప్రభుత్వం ప్రజలను కోరుతున్నది. అవేంటో చదువండి.
వేడిని అధిగమించడానికి చేయాల్సినవి..
– ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్) వీలైనప్పుడల్లా తాగండి.
– మజ్జిగ, నిమ్మరసం, పండ్ల రసాలు వంటివి ఇంట్లోనే తయారు చేసుకొని తాగండి.
– తగినంత నీరు తాగడం ఈ కాలంలో చాలా ముఖ్యం.
– వదులుగా, మెత్తగా ఉండే లేత రంగు కాటన్ వస్త్రాలను ధరించండి.
– బయటకు వెళ్లినప్పుడు గొడుగు, టోపీ, టవల్ వంటి వాటిని తలపై కప్పుకొని వెళ్లండి.
– చల్లని ప్రదేశాల్లో మాత్రమే ఉండండి. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోండి.
– ఉదయం, సాయంత్రం మాత్రమే పనులు చేయడానికి బయటకు వెళ్లండి.
ఇవి వద్దు..
ప్రభుత్వం ఈ కార్యకలాపాలను ఈ కాలంలో చేయకూడదని సూచించింది. అవేంటంటే…
– ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య ఎండలో బయట తిరగడం మానేయండి.
– చెప్పులు లేకుండా బయటకు అస్సలు వెళ్లకూడదు.
– వంట పనులను కూడా ఉదయమే ముగించేయాలి. ఈ ఎండలకు, స్టవ్ వేడి కారణంగా మరింత అలసిపోతారు.
– వేడి వేడిగా తినకుండా కాస్త చల్లబడ్డాకే తినడం బెటర్. ఇంకో విషయం ఎప్పటి వంట అప్పుడు చేసుకోండి. లేకపోతే ఈ ఎండ వేడికి అవి పాడైపోవచ్చు.
తస్మాత్ జాగ్రత్త..
– చిన్నపిల్లలు
– గర్భిణీలు
– ఆరుబయట పని చేసే వ్యక్తులు
– మానిసిక, శారీరక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు..
– గుండె జబ్బులు, అధిక రక్తపోటు ఉన్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
– కొందరికి ఎండ వేడి వల్ల కూడా కొన్ని అనారోగ్యాలు వస్తుంటాయి. వారు కూడా ఈ సమయంలో తస్మాత్ జాగ్రత్త!