రైతులకు వాతావరణ సూచన.. ఈ ఏడాది కూడా - MicTv.in - Telugu News
mictv telugu

రైతులకు వాతావరణ సూచన.. ఈ ఏడాది కూడా

April 14, 2022

18

దేశవ్యాప్తంగా ఈ ఏడాది కూడా సాధారణ వర్షాలు పడుతాయని రైతులకు వాతావరణ శాఖ (ఐఎండి) చెప్పింది. గురువారం ఐఎండి వర్షానికి సంబంధించిన పలు వివరాలను వెల్లడించింది. ”ఈ ఏడాది కూడా భారత్‌లో చాలా ప్రాంతాలలో సాధారణ వర్షపాతం నమోదవుతుంది. జూన్‌ 1న కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రారంభమవుతాయి. దాంతో ఉత్తర, మధ్య భారత్‌లోని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుంది. ఈశాన్య, వాయువ్య, దక్షిణ ద్వీపకల్పంలోని దక్షిణ భాగాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది” అని వాతావరణ శాఖ తెలిపింది.

మరోపక్క 2021లో కూడా నైరుతి రుతుకాలమైన జూన్‌ నుండి సెప్టెంబర్‌ వరకు దేశంలో సాధారణ వర్షపాతమే నమోదైంది. సాధారణం లేదా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావడం ఇది వరుసగా మూడో సంవత్సరం. గత సంవత్సరం రైతులు ఎంతో ఆశగా పంటలను వేస్తే, భారీ వర్షాలు పడి పంటలన్నీ దెబ్బతిన్న విషయం తెలిసిందే. దాంతో రైతులు నానా అవస్థలు పడ్డారు. అప్పుల మీద అప్పులు చేసి పంటలను వేశారు. వర్షాల కారణంగా పంటలకు నష్టం రావడంతో కొంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటువంటి సమయంలో వాతావరణ శాఖ రైతులకు ఈ సంవత్సరం కూడా సాధారణ వర్షాలు ఉంటాయని చెప్పింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.