సాధారణంగా పెళ్లిళ్లు ఫంక్షన్ హాళ్లలోనో లేదంటే గుళ్లలోనే జరుగుతాయి. కానీ నెల్లూరులో జరిగిన ఓ పెళ్లి వేడుక మాత్రం ఓ సినిమా థియేటర్లో జరిగింది. థియేటర్ ఎదుట పలగాటి వారి పెళ్లి సందడి.. నూతన వధూవరులను ఆశీర్వదించాలి.. అంటూ పోస్టర్లు స్వాగతం చెబుతుండగా బంధువులంతా థియేటర్‌కు వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. ఇదేంటి పెళ్లిళ్ల ట్రెండ్ మారి.. సినిమా హాళ్లలో జరుపుతున్నారా అని డౌట్ పడకండి.ఎందుకంటే.. పెళ్లి జరిగింది అమెరికాలో.. ఆన్లైన్ స్ట్రీమింగ్ పద్దతిలో భారీ స్క్రీన్‌పై(70ఎంఎం థియేటర్లో) తిలకించిన వారు అమ్మాయి తరఫువారు.
సప్త సముద్రాల అవతల ఉన్న కన్న కూతురి కల్యాణం జరుగుతుంటే అక్కడికి చేరుకోలేని ఆ తల్లిదండ్రులు సూళ్లూరుపేటలో వెండితెరపై వివాహ తంతులో పాల్గొని సంతృప్తి పడ్డారు. నెల్లూరుకు చెందిన పలగాటి శ్రీనివాసులురెడ్డి, సునీల దంపతుల తనయ రిషిత అమెరికాలో ఎంబీఏ చదువుతోంది. ఆమెకు అమెరికా నివాసులైన పర్వతరెడ్డి శ్రీనివాసులురెడ్డి, జ్యోతి దంపతుల తనయుడు రోహిత్‌రెడ్డితో అమెరికాలో మే 21వ తేదీ (భారత కాలమానం మేరకు మే 22వ తేదీ)న వివాహం జరిపించాలని నిర్ణయించారు. అమ్మాయి తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లేందుకు వీసాకు దరఖాస్తు చేసినా మంజూరు కాలేదు. దాంతో కుమార్తె పెళ్లి వేడుక చూడాలని సూళ్లూరుపేటలోని బాహుబలి (వీఎపిక్) థియేటర్‌ను బుక్ చేసుకున్నారు. బంధుమిత్రులతో కలిసి ఆ థియేటర్లో సిల్వర్ స్క్రీన్‌పై అమెరికాలో జరుగుతున్న కుమార్తె వివాహాన్ని తిలకించారు.