ఎమ్మెల్యే కూతురి పెళ్లిపై రచ్చ రంభోలా..
లాక్‌డౌన్ కారణంగా వేల పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. అయితే ముహూర్త బలమని, మరొకటని కొందరు తాళపు ఘడియల్లోనే తాళి తంతు ముగిస్తున్నారు. ఇటీవల కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడ పెళ్లిని ఉన్నంతమంది అతిథులతో బాగానే చేశారు. అయితే, మూతులకు కనీసం మాస్కులు కూడా కట్టుకోకుండా, భౌతిక దూరం పాటించ లేదని ఆరోపణలు రావడంతో యడియూరప్ప సర్కారు నివేదిక కోరింది. తాజాగా తమిళనాడు ఎమ్మెల్యే కూడా తన కూతురి పెళ్లిని పూర్తి చేయించాడు. నిఖిల్ పెళ్లిలోలా కాకుండా భౌతిక దూరాన్ని చక్కగా పాటించారు. మూతులకు మాస్కులు కూడా చుట్టుకున్నారు. అయినా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సేలం జిల్లా ఏర్కాడు ఎమ్మెల్యే గుణశేఖర్ తన కుమార్తెను సింధును, ప్రశాంత్ అనే ఇంజినీరుకు ఇచ్చి పెళ్లి చేశారు. ఈ నెల 26న వళప్పాడిలోని తాంతోంద్రీశ్వర్ గుడిలో ఈ తంతు ముగిసింది. పెద్ద సంఖ్యలోనే అతిథులు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే లాక్ డౌన్ సమయంలో గుడి తలుపులు తీసి పెళ్లి చేశారని అంటున్నారు. కానీ గుడి బయట మెట్లవద్ద చేశామని గుణశేఖర్ చెబుతున్నారు. ఫొటోగ్రాఫర్, పూజారి సహా కేవలం 14 మందిమే పాల్గొన్నామని అంటున్నాయి. అయితే వందల మంది వచ్చారని డీఎంకే మండిపడుతోంది. సామాన్యులకు ఒక న్యాయం, అధికార ఎమ్మెల్యేకు ఒక న్యాయమా అని ప్రశ్నిస్తూ విచారణ జరపాలని డిమాండ్ చేస్తోంది.