గంజాయితో కరోనాను నయం చేయొచ్చు.. ట్వీట్ వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

గంజాయితో కరోనాను నయం చేయొచ్చు.. ట్వీట్ వైరల్

February 17, 2020

Coronavirus

కరోనా వైరస్‌తో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు భీతిల్లిపోతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు పనిగట్టుకుని మరీ రకరకాల పుకార్లను షికారు చేస్తున్నారు. కొందరైతే ఆ వైరస్‌కు మందు ఉందని చెప్పేస్తున్నారు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి మాత్రం అందరికంటే ఓ అడుగు ముందుకు వేసి గంజాయితో కరోనా వైరస్ తగ్గుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. 1980కి ముందు గంజాయిని ప్రభుత్వమే విక్రయించేదని.. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హయాంలో దీనికి చెడు పేరును అంటగట్టారని ట్వీట్ చేశారు. ‘ప్రపంచంలోని చాలా సమస్యలకు భారతదేశంలోనే పరిష్కారం ఉంది. మా పురాతన జ్ణానాన్ని ఎగతాళి చేసినంత వరకు దానిని మీరు గుర్తించలేరు. కెనాబిస్ (గంజాయికి ఉన్న మరో పేరు) మ్యాజిక్ చెట్టు. 1980కి ముందు ప్రభుత్వమే దీనిని విక్రయించేది. కానీ రాజీవ్ గాంధీ, కొన్ని పశ్చిమ ఫార్మా కంపెనీలు దీనికి చెడ్డ పేరును అంటగట్టాయి. కెనాబిస్‌ను మళ్లీ లీగల్ చేయాలి’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఆయన ట్వీట్‌పై దర్శకుడు విక్రమాదిత్య మొత్వానే సెటైర్లు వేశారు. త్రిపురలో బీఎస్ఎఫ్ దళాలు గంజాయిని తగలబెడుతున్న ఫోటోలు షేర్ చేస్తూ, వివేక్‌కు ట్యాగ్ చేశారు. ‘వారు (భద్రతా దళాలు) భారతీయ జ్ణాన సంపదను కాల్చేస్తున్నారు సర్’ అని సైటైర్ వేశారు. కాగా, వివేక్ అగ్నిహోత్రి వ్యాఖ్యలపై నెటిజెన్లు మండిపడుతున్నారు. ‘తప్పుడు వార్తలను ఆధారం చేసుకుని దేశంలో మాదక ద్రవ్యాలను ప్రమోట్ చేస్తున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేస్తున్నారు.