Weird cat named Hope a kitten neither male nor female because it has no sex organs
mictv telugu

ఈ పిల్లి ఆడా కాదు, మగా కాదు.. అసలు..

November 8, 2022

పిల్లుల్లో రకరకాలు ఉంటాయి. పెంపుడు పిల్లి, అడవి పిల్లి, జంగుపిల్లి, పునుగుపిల్లి మరెన్నో పిల్లులు. ఒక్కోటీ ఒక్కో వెరైటీ. రంగు, ఆకారం, తినే తిండి వేటికవే వేర్వేరు. ఇంత వైవిధ్యభరితమైన మార్జాల ప్రపంచంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రపంచంలో ఇంతవరకు లేని ఒక పిల్లి ముచ్చట బయటికొచ్చింది. అలాంటి పిల్లి అదొక్కటే కావడం పెద్ద వార్తయి కూర్చుంది.

ఇంగ్లండ్‌లోని వారింగ్టన్ పట్టణంలో ఉందీ పిల్లికూన. ఇది వీధిపిల్లి. ఇది ఆడది కాదు, మగదీ కాదు. అసలు దీనికి జననాంగమే లేదు. బయటే కాదు, లోపల కూడా ఎలాంటి పునరుత్పాదక అవయవాలూ లేవు. దీని పేరు హోప్. దీన్ని సాకుతున్న ‘క్యాట్ ప్రొటెక్షన్’ టీం సభ్యులు తొలుత ఇది ఆడది అనుకున్నారు. అయితే పెరిగేకొద్దీ అలాంటి ఆనవాళ్లేమీ కనిపించకపోలేదు. లైంగిక అవయవాలు పెరగలేదని గమనించారు. జంతుశాస్త్రంలో ఈ వింత లోపాన్ని ఎజినెసిస్ అంటారు. ఆడో మగో తెలియకున్నా హోప్ మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. పెట్టింది తిని చక్కగా ఆడుకుంటుంది. పిల్లి కడుపులో అండవాహికల్లాంటి వుండొచ్చేమోనని, అయితే తమకు ఆ నమ్మకం పోతోందని పశువైద్యులు అంటున్నారు. హోప్ వయసు ప్రస్తుతం 15 వారాలే. తమకు తెలిసినంతవరకు ఇలాంటి పిల్లి మరొకటి లేదని క్యాట్ ప్రొటెక్షన్ టీం చెబుతోంది. హోప్‌ను చూడ్డానికి ఊళ్లోని జనం తండోపతండాలుగా వస్తున్నారట.