కొన్ని ప్రేమలు మహా విచిత్రం. ఎవరు, ఎవర్ని, ఎక్కడ, ఎలా, ఎందుకు ప్రేమిస్తారో, ఎందుకు పెళ్లి చేసుకుంటారో ఊహించడం దేవుడి తరం కూడా కాదు. మనసు పడితే అంతే, వావి వరసలే కాదు, లింగ, మత, ప్రాంత, దేశ, రాష్ట్ర, ధనిక, పేద, వయోగియో వంటి భేదాలేమీ చూడకుండా పీకల్లోతు ప్రేమలో మునిగిపోతారు. అన్ని కష్టాలను ఎదురీది జట్టు కట్టేస్తారు. బిహార్‌లో ఓ వివాహత స్వయానా తన భర్త సోదరిని గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకుంది. పాపం, భర్త కూడా భార్య, చెల్లెలి కోరిక కాదనలేక పెళ్లి చేశాడు. పెళ్లి అంటే బడితెపూజలాంటి కొట్టడం గిట్టడం కాదండోయ్.. నిజమైన పెళ్లే. విషయం బంధువులకు తెలిసి రచ్చరచ్చ జరిగిపోతోంది..
ఆర్నెల కిందట.
సమస్తిపూర్‌కు చెందిన ప్రమోద్ దాస్ 2013లో శుక్లాదేవి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ పదేళ్లు చక్కగా కాపురం చేసి ఇద్దరు పిల్లల్ని కూడా కన్నారు. ఆరు నెలల కిందట చిన్నాడపడచు సోనీదేవి వీరి ఇంటికొచ్చింది. ఎక్కడేం జరిగిందోగాని ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. ఇద్దరూ ఆడవాళ్లుగా ఉంటే ప్రేమయాణం రంజుగా ఉండదని, శుక్లాదేవి చొక్కా ప్యాంటు ధరించి, జట్టు కత్తించుకుని మగవాడి రూపు దాల్చింది. అంతేకాకుండా పేరును కూడా సూరజ్ కుమార్ అని పెట్టుకుంది. విషయం తెలిసిన ప్రమోద్ దాస్ తల పట్టుకున్నాడు. అటు చూస్తే పెళ్లాం, ఇటు చూస్తే చెల్లెలు! వాళ్లను విడదీయడం పద్ధతి కాదని పెద్దమనసు చేసుకుని పెళ్లి చేశాడు. కానీ అతని అక్క ఉషాదేవి మాత్రం ఊరుకోలేదు. శుక్లాదేవి తమ ఇంటి పరువు తీసిందని తిట్టిపోసింది. ముగ్గుర్నీ చెడామడా తిట్టి, ఆడజంటను విడదీసింది. దీంతో శుక్లాదేవి అలియాస్ సూరజ్ కుమార్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తన వదిన తన భార్యను కిడ్నాప్ చేసిందని వాపోయింది. పోలీసులు విషయం ఆరా తీస్తున్నారు.
‘మీ ఆడపడుచును ఎందుకు పెళ్లాడావు, భర్త ఉన్నాడు కదా,’ అని విలేకర్లు శుక్లాదేవిని ప్రశ్నించగా, ‘‘భర్త ఉంటే మరో ఆడదాన్ని ప్రేమించకూడదా? మా ప్రేమ గుండెలోతుల్లోంచి పుట్టింది. మేం ఇష్టపడ్డాం, హాయిగా ఉన్నాం, ఇలాగే ఉంటాం’’ అని చెప్పింది. ప్రమోద్ దాస్ కూడా అలాగే చెప్పాడు. ‘ఆమె సంతోషంగా ఉండడమే నాకు చాలు. వాళ్లను విడదీస్తే ఏమొస్తుంది? నా భార్య మనసు మార్చలేంగా’ అన్నాడు.