జంతువులకు పెళ్ళిళ్ళు చేయడం తెలుసు. మనిషికీ, జంతువుకీ కూడా పెళ్ళి చేస్తే చూశాము. కానీ ఇప్పుడు చెప్పబోయే వివాహం గురించి మాత్రం మీరు కచ్చితంగా విని ఉండరు. కనీవినీ ఎరుగని వింత ఆచారం పాటిస్తున్నారు ఉత్తరప్రదేశ్ లోని బహ్రైచ్ జిల్లా వాసులు.
బావిలో నీళ్ళు తోటకు పెడతారు అని తెలుసు. కానీ ఆ రెంటికీ పెళ్ళి చేయడం గురించి ఎక్కడైనా చూశారా….పోనీ ఎప్పుడైనా విన్నారా. ఇదిగో ఉత్తరప్రదేశ్ లో బహ్రైన్ జిల్లాకు వెళితే దీన్ని ప్రత్యక్షంగా వినొచ్చు, చూడొచ్చు. ఈ మధ్యనే అక్కడ ఓ బావికి, తోటకి పెళ్ళి చేశారు. ఆ పెళ్ళికి పత్రికలు కూడా అచ్చు వేయించారు. దాన్ని చూడ్డానికి 15వందల మంది జనం కూడా వచ్చారు. ఇందులో ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారు. పైగా ఇది వాళ్ళకు తరాతరాలుగా వస్తున్న ఆచారమని కూడా చెబుతున్నారు. ఇలా పెళ్ళి చేయడం తమ సంప్రదాయంలో భాగమని ఆ వూరిలోనే అందరికన్నా పెద్ద అయిన 80 ఏళ్ళ దేవీ బక్ష్ సింగ్ అన్నారు. ఇలా పెళ్ళి చేయాలని దేవి చాలా రోజుల నుంచి అనుకుంటున్నారుట, ఇప్పటికి కుదరిందని చెబుతున్నారు.
అసలు ఎందుకు ఇలా పెళ్ళి చేసాము అన్నదానికి కూడా క్లారిటీ ఇస్తున్నారు దేవి బక్ష్ సింగ్. పెళ్ళి చేసిన బావి ఊళ్ళో అన్నిటికంటే అత్యతం పురాతనమైనది అంట. దానిలో ఎప్పుడూ నీళ్ళఉ ఉంటూనే ఉన్నాయిట. ఇప్పుడు ఆ బావి ఎండిపోవడం మొదలైంది. అది ఊరికే మంచిది కాదు అనుకున్నారు. అందుకే తమ పూర్వీకులు సంప్రదాయాన్ని తిరిగి పాటించామని అంటున్నారు దేవి. అలా పెళ్ళి అయిన బావిని పూజిస్తారుట. కొత్తగా పెళ్ళయిన వాళ్ళు తప్పకుండా బావి దగ్గరకు వచ్చి పూజలు చేస్తారుట. ఏంటో వింత ఆచారాలు, సంప్రదాయాలు.