అటు రాష్ట్రపతి ఎన్నిక, ఇటు వచ్చే పార్లమెంటు ఎన్నికలతో దేశంలో రాజకీయ వేడి పెరిగింది. జాతీయ పార్టీ పెట్టడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న యత్నాలు కొలిక్కి వస్తున్నాయి. ఆయన ఈ నెలలోనే ఢిల్లీలో జాతీయ పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో థర్డ్ ఫ్రంట్లో తన పాత్ర కూడా ఉందంటూ సంకేతాలిస్తున్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేసీఆర్కు ఫోన్ చేశారు. ఈ నెల 15న ఢిల్లీకి రావాలని ఆయనను కోరారు. కేసీఆర్ సహా 22 మంది విపక్ష నేతలకు ఆమె లేఖ రాశారు. వీరిలో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్ సీఎం తదితరులు ఉన్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేతర పార్టీలు తమ ఉమ్మడి అభ్యర్థి ఎంపికలో భాగంగానే ఈ భేటీ నిర్వహిస్తున్నట్లు సమాచారం. కేసీఆర్ ఇటీవల పలు రాష్ర్టాలకు వెళ్లి ముఖ్యమంత్రులతో భేటీ అవుతుండడం, బీజేపీకి, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు కొన్నాళ్లు యత్నిస్తుండడం, కొన్నాళ్లు విరామం తీసుకుంటుండడం తెలిసిందే. రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ రావడంతో మళ్లీ థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు ఊపందుకున్నాయి.