కష్టపడి పట్టుదలతో ప్రయత్నిస్తే ఏది అసాధ్యం కాదని నిరూపించాడు ఓ పేద విద్యార్థి. తనలోని టాలెంట్ బయటకు తీసి ఏకంగా వైద్య విద్యలో చేరేందుకు అర్హత సంపాధించాడు. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదివినా కూడా డాక్టర్ కావాలనే సంకల్పంతో మంచి ర్యాంక్ సాధించాడు. ఇటీవల విడుదలైన నీట్ 2020 ఫలితాల్లో 620వ ర్యాంకు సాధించాడు. యూపీలోని కుషీనగర్ ప్రాంతంలో ఉండే అరవింద్ అనే వ్యక్తి ఈ ఘనతను సాధించాడు.
బర్డీ గ్రామానికి చెందిన అరవింద్ తండ్రి వీధి వీధి తిరుగుతూ పాత సామాన్లు, చెత్త సేకరించి కుటుంబాన్ని పోంచుకుంటున్నాడు. పేదరికాన్ని చూసిన అతడు ఎలాగైనా ఉన్నత స్థాయికి చేరాలని అనుకున్నాడు. రిక్షాతో వీధుల్లో తిరుగుతూ కొడుకును తనకు ఉన్నంతలో చదివించాడు. డాక్టర్ కావాలనే కోరితో అతడిని ఓ కోచింగ్ సెంటర్లో చేర్పించాడు. తొలిప్రయత్నింలో అరవింద్‌కు మంచి ర్యాంక్ రాలేదు. రెండవ ప్రయత్నంలో తన కలను నెరవేర్చుకున్నాడు. ఆల్ ఇండియా స్థాయిలో 11,602, ఓబీసీ కేటగిరీలో 4,392వ ర్యాంకు సాధించాడు. దీంతో అతడి వైద్యకు అవకాశం దక్కింది.
గోరఖ్‌పూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే సమయంలో అరవింద్ ప్రతి రోజూ తన గ్రామం నుంచి 8 కిలోమీటర్ల దూరం సైకిల్ పై వెళ్లేవాడు. 10వ తరగతిలో 48 శాతం, ఇంటర్మీడియట్లో 60 శాతం మార్కులు మాత్రమే వచ్చాయి. అయినా కూడా డాక్టర్ కావాలనే పట్టుదలతో నీట్‌కు సిద్ధమై అర్హత సాధించాడు. తమ గ్రామంలో అరవింద్ తొలి డాక్టర్ కాబోతున్నాడని స్థానికులు చెబుతున్నారు. అతడిపై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేశాక ఆర్థోపెడిక్ సర్జన్ అవుతానని అంటున్నాడు.