Wham....there is no end to human ingenuity
mictv telugu

వామ్మో….మానవ మేధకు అంతులేదు

November 24, 2022

ఇందుగలడు అందు లేదని సందేహం వలదు ఇది విష్ణుమూర్తి గురించి పద్యం కానీ దీన్ని ఇఫ్పుడు మనం కృత్రిమ మేధకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం విద్య నుంచి వైద్యం వరకూ, వ్యాపారం నుంచి వ్యవసాయం వరకూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రమేయం లేని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. మనిషి స్థానాన్ని తమ సొంతం చేసుకుంటున్న రోబోలు ఇప్పడు మనుషుల్లా ప్రసంగాలు కూడా చేస్తున్నాయి. తాజాగా బ్రిటీష్ పార్లమెంటులో ఓ రోబో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఆధునిక యుగంలో కృత్రిమ మేధస్సు కొత్త పుంతలు తొక్కుతోంది. మనుషులు చేయగలిగే పనులతో పాటు చేయలేనివి కూడా దీని ద్వారా సాధ్యమవుతున్నాయి. తాజాగా, బ్రిటన్ పార్లమెంట్‌లో ఓ రోబో ప్రసంగించి అందర్నీ నివ్వెరపరిచింది. ఓ రోబో పార్లమెంట్‌లో ప్రసంగించడం యునైటెడ్‌ కింగ్‌డమ్‌ చరిత్రలో ఇది తొలిసారి. 2019లో ఐడాన్‌ మెలెర్‌ ఆవిష్కరించిన ఈ రోబోను బ్రిటన్ గణిత శాస్త్రవేత్త అడా లవ్‌లేస్‌ పేరుతో ఐ-డా అని పిలుస్తున్నారు.

తనకు జీవం లేకపోయినా కళను తాను ఉత్పత్తి చేయగలనని ఐడా తన ప్రసంగంలో చెప్పింది. మీకు ఉన్న ఆలోచన శక్తి నాకు లేదు.. కానీ నాకు ఊహాశక్తి ఉంది.. ఆ ఊహ నుంచి కళను చిత్రించగలను.. మానవుల ఊహాశక్తి ఎంత భిన్నంగా ఉంటుందో నేను చెప్పగలను కానీ అనుభవించలేను అంతే అంటూ గడగడా మాట్లాడేసిందట ఐడా రోబో. దీని మాటలకు బ్రిటీష్ పార్లమెంటులో అందరూ ముగ్ధులయిపోయారుట కూడా.

మీ ఆలోచనల నుంచి ఓ చిత్రాన్ని గీస్తే దానిని నేను ఊహించగలను.. నాకు ఆలోచన శక్తి లేనందున నేను మానవులకన్నా భిన్నమైన విషయాలను చూస్తున్నాను’’ అని ఐడా వ్యాఖ్యానించింది. టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సృజనాత్మకతపై దాడి జరుగుతుందా? అనే దాని గురించి మాట్టాడిన ఐడా, కమ్యూనికేషన్స్, డిజిటల్ కమిటీ సభ్యులతో ఎక్కువగా మాట్లాడిందిట.

ఇలా రోబోలు మాట్లాడడం ఇదే మొదటిసారి కాదు. అంతకు ముందు హాంకాంగ్ రోబో సోఫియాను 2016 ఫిబ్రవరి 14న యాక్టివేట్ చేయగా.. నెల రోజుల తర్వాత టెక్సాస్‌లో జరిగిన సౌత్‌వెస్ట్ ఫెస్టివల్‌లో బయట ప్రపంచానికి పరిచయం చేశారు. దీనికి 2017లో పౌరసత్వం లభించడంతో ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి రోబోగా సోఫియా నిలిచింది. ఐక్యరాజ్యసమితి అభివృద్ది కార్యక్రమంలో భాగంగా దీనిని తయారుచేశారు. కానీ సోఫియా కన్నా ఇప్పడు ఐడా మరింత హై టెక్నాలజీతో తయారవడమే కాక చాలా అద్బుతంగా కూడా మాట్లాడింది అని అంటున్నారు.

సాంకేతిక తప్పిదం వల్ల ప్రసంగం మధ్యలో ఐడాకు మెల్లకన్ను ఉన్నట్టు కనిపిస్తుందిట. అయితేనేమి దాని ప్రతిభకు ఏమీ కొదవ లేదు. కానీ ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవలసిన ముఖ్య విషయం ఏంటంటే….రోబోలు మాట్లాడ్డం, మనం చేసే పనులు అవి చేయడం చాలా అద్భుతమైన విషయమే అయినప్పటికీ వాటి వెనుక అపారమైన మానవ మేధస్సు ఉందనే వవిషయం మాత్రం మర్చిపోకూడదు. ఇలాంటి రోబోలను తయారు చేయడానికి ఏళ్ళకు ఏళ్ళు కష్టపడ్డ వారిని కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి కూడా.