కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చైనాలో ఈ కేసులు మరింత ఎక్కువగా ఉన్నాయి. అయితే అదే చైనాలో ఒక కొత్త ట్రెండ్ నడుస్తున్నది. అది దారినపోయేవారికి ముద్దు పెట్టే ట్రెండ్.
రోడ్డున వెళ్లే వారిని ముద్దు పెట్టుకుంటా అంటే ఊరుకుంటారా? లాగి ఒక్కటిస్తారు. కానీ ఇలా తెలియని వారిని ముద్దు పెట్టుకునే ట్రెండ్ ఒకటి మొదలైంది. చైనాలో ఇప్పుడు మౌత్ బడ్డీస్ అనే డేటింగ్ ట్రెండ్ నడుస్తున్నది. అంటే.. దారిన పోయేవారంతా ఒకరికొకరు ముద్దులు ఇచ్చుకోవడం అన్నమాట. ఒకరికొకరు తెలియకపోయినా, అపరిచితులు అయినా సరే ముద్దు పెట్టడం ఈ ట్రెండ్ ముఖ్య ఉద్దేశం. దీన్ని ఇంకా జుయి యూ అనే ముద్దుగా పిలుస్తున్నారు. ఈ ట్రెండ్ కేవలం ముద్దులు ఇవ్వడం మాత్రమే అని, దీంట్లో ఎలాంటి రిలేషన్ షిప్ కానీ, శృంగారం కానీ ఉండదు. కిస్సింగ్ సెషన్స్ ముగిసిన తర్వాత ఆ జంటలు మళ్లీ కలుసుకోవడం అంటూ ఉండదు. కేవలం ముద్దు పెట్టుకొని అక్కడి నుంచి వెళ్లిపోతారు.
తెలియని వారిని కిస్ చేయడం అనేది కొంత వింతగా, కొత్తగా అనిపిస్తుందంటున్నారు చాలామంది. కొందరేమో ఈ ట్రెండ్ ని ఎండగట్టే పనిలో ఉన్నారు. కేసులు పెరుగుతున్న సమయంలో బహిరంగంగా ఇలా ముద్దులు పెట్టుకోవడం ఏంటని విమర్శిస్తున్నారు. అయితే ముద్దులు ఇచ్చుకోవడం వల్ల శారీరకంగా, మానసికంగా ఫ్రీ అవుతామని, శృంగారంతో పోలిస్తే దీనివల్ల ఎలాంటి సమస్యలు రావని అంటున్న వాళ్లు లేకపోలేదు. ఏది ఏమైనా ఈ ట్రెండ్ మాత్రం ఎక్కడా ఆగడం లేదు.
కరోనా కారణంగా..
చైనాలో జీరో కోవిడ్ నిబంధనలను సడలించారు. దీంతో వేల సంఖ్యలో కేసులు వచ్చాయి. చైనాలో హాస్పిటల్స్ మొత్తం కరోనా కేసులతో నిండిపోయాయి. ఇటీవల కాలంలో ఒక్క బీజింగ్ లోనే రోజుల వ్యవధిలో 2700మంది చనిపోయినట్లు హాంకాంగ్ మీడియా చెబుతున్నది. కొన్ని శ్మశానవాటికలు కోవిడ్ మృతులతో నిండిపోయాయని వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొన్నది. రోజుకు ఆ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ సమయంలో ఈ ట్రెండ్ పెరుగడం వల్ల కేసులు మరింత పెరుగుతాయని చాలామంది అంటున్నారు. మరి ఈ ట్రెండ్ ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి.