బాలీవుడ్‌లో తెలుగోడి జెండా.. బాలుకు హారతి - MicTv.in - Telugu News
mictv telugu

బాలీవుడ్‌లో తెలుగోడి జెండా.. బాలుకు హారతి

September 25, 2020

What are some of the good Hindi songs of S.P Balasubramaniam?

తెలుగు సినీ చరిత్రలో ఓ శకం ముగిసింది. గాన గంధర్వుడిగా వేల పాటలు పాడిన ఆ స్వరం ఇక శాశ్వతంగా మూగబోయింది. విశ్వవ్యాప్తంగా దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గానం ఎందరో ప్రేక్షకులను రంజింపజేసింది. 16కి పైగా భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడారు. ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయన సొంతం. కిషోర్ కుమార్, ఉదిత్ నారాయణ్, అనురాధా పౌడ్వాల్, ఆశాభోంస్లే, లతా మంగేష్కర్,  శ్రేయాగోషాల్ వంటి ఎందరో గాయనీ గాయకులు వచ్చి తెలుగులో పాటలు పాడారు. మన బాలూ కూడా బాలీవుడ్‌లో ఎన్నో పాటలు పాడారు. అక్కడ ఎన్నో హిట్ పాటలను అందించారు. ఇప్పటికీ ఆయన హిందీలో పాడిన పాటలు మారుమోగుతుంటాయి. 1981లో వచ్చిన ‘ఏక్ దూజేకే లియే’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు బాలు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ తెరంగేట్రం చేసిన సినిమా ‘మైనే ప్యార్ కియా’ సినిమాలో బాలు పాడిన ‘ఆజా శాము హోనె ఆయి’ ‘మేరే రంగ్ మే రంగ్‌నే వాలి’ ‘ఓ మైనే ప్యార్ కియా ప్యార్ కియా’ ‘ఆయా మోసమ్ దోస్తీకా’ పాటలన్నీ సూపర్ డూపర్ హిట్లే. ఆ సినిమాలోని పాటలన్నీ బాలూయే పాడటం విశేషం. ఆ తర్వాత వచ్చిన ‘హమ్ ఆప్‌కే హై కౌన్’ సినిమా మ్యూజికల్‌గా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమాలో కూడా బాలు, సల్మాన్ కాంబినేషన్ బాగా కలిసొచ్చింది. ఆ చిత్రంలోని పాటలన్నీ బాలూయే పాడారు.

సల్మాన్ ఖాన్‌కు హీరోగా ఆ సినిమా తిరుగులేని విజయాన్ని అందించింది. బాలూకి కూడా ఆ సినిమా ఎన్నో ఆఫర్లను తెచ్చిపెట్టింది. అప్పటినుంచి సల్మాన్ సెంటిమెంటల్‌గా తాను నటించే సినిమాలో బాలూతో ఓ పాట పాడించేవారు. అలా వారి కాంబినేషన్‌లో వచ్చిన ఎన్నో పాటలు మరుపురాని మధురమైన పాటలు అయ్యాయి. యువ గాయనీ గాయకులతో సమానంగా ఆయన వేల పాటలను ఆలపించారు. ఆ తర్వాత ‘సాజన్’ సినిమాలో బాలు పాడిన ‘దేఖా హై పహ్‌లీ బార్’ పాట ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ‘ఏక్ దూజే కే లియే’ సినిమాలో ‘మేరే జీవన్ సాథీ’ ‘తేరే మేరే బీచ్‌మే కైసా హై యే బంధన్ అంజామ్’ వంటి పాటలు ఆల్ టైమ్ రికార్డులుగా నిలిచాయి. ఇలా చెప్పుకుంటూపోతే ఆయన గాత్రంనుంచి ఎన్నో హిందీ పాటలు వచ్చాయి. అలాగే భారతీయ భాషలన్నింటిలోనూ ఆయన పాటలు పాడారు. తెలుగులో క్షణం తీరిక లేకుండా సినిమా పాటలు పాడుతున్న సమయంలోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బాలు అక్కడ తెలుగువాడి సత్తా చాటారు. దేశవ్యాప్తంగా కోట్ల మంది శ్రోతలను అలరించడానికి ఎస్పీ బాలసుబ్రమణ్యానికి బాలీవుడ్‌ ఓ చక్కటి వేదికగా మారింది. రొమాంటిక్‌ సాంగ్స్‌ అద్భుతంగా పాడారు. హిందీలో ఆయన పాడిన పాటలు యువతను ఉర్రూతలూగించాయి. పాడుతూనే బుల్లితెర వేదికగా ఎంతోమంది కొత్త గాయనీ గాయకులను పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ‘పాడుతా తీయగా’ వంటి కార్యక్రమంతో కొత్తవారికి లైఫ్ ఇచ్చారు. కాగా, వేలాదిగా పాటలు పాడిన ఆయన ఇకలేరు అన్న నిజాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోవడం లేదు. ప్రతీ హృదయం బాధతో ఆయనకు కన్నీటి నివాళి అర్పిస్తోంది.