గుజరాత్ ప్రజలు ఎటు వైపు? సర్వేలు ఏం  చెబుతున్నాయి? - MicTv.in - Telugu News
mictv telugu

గుజరాత్ ప్రజలు ఎటు వైపు? సర్వేలు ఏం  చెబుతున్నాయి?

December 5, 2017

గుజరాత్ లో 22 ఏళ్ల బీజేపి పాలనకు ప్రజలు ది ఎండ్ చెప్పబోతున్నారా? ఏ అభివృద్ధి నమూనాను అయితే చూపించి నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయ్యారో అదే ఇప్పుడు బీజేపీ కి శాపంగామారునుందా? ఈ ప్రశ్నలకు ఎన్నికల సర్వేలు అవుననే జవాబు చెపుతున్నాయి. పోలింగ్ డేట్ దగ్గరికొస్తున్న కొద్ది  బీజేపి పల్స్ రేట్ పడిపోతుంది. కాంగ్రెస్ గ్రాఫ్ అనూహ్యంగా పెరుగుతుందని సర్వేలు తేల్చి చెపుతున్నాయి. తాజాగా లోక్ నీతి-సిఎస్ డిఎస్-ఏబీపీ జరిపిన సర్వేలో బీజేపీకి కాంగ్రెస్ గట్టిపోటీ ఇస్తుందని తేలింది.

గుజరాత్ ఎన్నికల ప్రచార పర్వం దాదాపు ముగింపుకు వచ్చింది. మోడీ తన మంత్రాంగంతో సమస్త యంత్రాగాన్ని  వెంటేసుకుని డప్పు కొట్టుకుంట బాజాలు మొగించుకుంట ఊసు పోకుండ తిరుగుతునే ఉన్నాడు.ఎగ్జిట్ పొల్స్ మాత్రం ఆయన ఎంత ఎత్తుకు ఎగిరితే అంత కిందికి ఓట్ల శాతం పడిపోతున్నదని లెక్కలు కడుతున్నాయి. చివరి విడత జరిపిన సర్వే ప్రకారం మోడి ప్రచారం మొదలు పెట్టిన నాటికి ప్రజల్లో అంతెత్తున ఉన్న నమ్మకం ప్రచారం ముగుస్తున్న టయానికి ఆయన ఎత్తుకు దిగింది.

లోక్ నీతి-సిఎస్ డిఎస్- ఏబిపీ జరిపిన తాజా సర్వేలో కాంగ్రెస్ బిజెపీలకు చెరి 43 శాతం ఓట్లు వస్తాయని తెలిసింది. ఈ రెండు నెలల కాలం లో మోడీ ప్రభ తరిగిపొతు తరిగిపొతు 19 శాతం కిందకు జారింది. ఇదే టైంలో రాహుల్ గాంధీ పాపులారిటీ 17 శాతానికి పైగా పెరిగినట్టు అంచనా వేసింది. ఓటింగ్ సమయానికి మోడీ గ్రాఫ్ ఇంకెంత పడిపోతుందో? రాహుల్ పాపులారిటి ఎంత పెరుగుతుందో చూడాలి. మాములుగానే ఎగ్జిట్ పోల్ సర్వేలు ప్రభుత్వానికి కొంత అనుకూలంగా ఉంటాయి. రెండు మూడు శాతం కరెక్షన్స్ కూడా కలుపుకుంటే బిజెపి పరిస్తితి భయానకమే. ఇదే గనుక జరిగితే గుజరాత్ తో పాటు దేశంలోనూ రాజకీయ భూకంపం ఖాయం.

ఈ రిపోర్ట్ రావడానికి ముందు రాహుల్ గాంధీ  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఖాయమైంది.  కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా గుజరాత్ ఎన్నిక అతనికి తొలి పరీక్ష. అందుకు తగ్గట్టుగానే రాహుల్ పకడ్బందిగా ప్రచారాన్ని నిర్వహించాడు. అయితే  ఎన్నికల ప్రచారంలో నెహ్రూ కుటుంబం మీద మోడి చేసిన విమర్శలు ప్రధానమంత్రి స్థాయిని కిందకు దించాయే కాని ఏ మాత్రం నిలబెట్టలేక పోయాయి. గుజరాత్ ప్రజలకు నెహ్రూ ఫ్యామిలీ వ్యతిరేకం అని, ఇందిరాగాంధీ  మోర్బీ పర్యటనకు వచ్చినప్పుడు ముక్కు మూసుకుందని, రాహుల్ మీద చేసిన చౌకబారు విమర్శలు చిన్న పిల్లల చాడీల లాగా ఉండడం చూసి ప్రజలు విస్తుపోయారు.

22 ఏళ్ళు అధికారం లో వున్న పార్టీకి ఈ మాత్రం వ్యతిరేకత అసలు సమస్యే కాదు. కాని గుజరాత్ అభివృద్ధి నమూనా దేశమంతా తిరిగి సొంతగూటికి చేరుకుంటున్న సందర్భం ఇది. ఏ నమూనా అయితే జాతీయ స్థాయిలో విజయవంతంగా అమ్ముడుపోయి గద్దెనెక్కిందో, ఇప్పుడు అదే నమూనా దేశ ప్రగతికి పనికొస్తుందో లేదో అన్న సందేహం సొంత రాష్ట్రానికి పాకి మోడీ ని ఆగమాగం చేస్తోంది. ఓ వైపు పటేల్ ల ఆందోళన, దళితుల మీద దాడి, రైతుల ఆందోళనలు తమ తలరాత మారుస్తాయని తెలిసినా, ఏం చేయాలో తెలియక సతమతయిన ఆ రాష్ట్ర ప్రభుత్వం, అభివృద్దినే నమ్ముకుని ఎన్నికలకు సిద్దపడింది. అయితే మైసూర్ బజ్జిలో మైసూర్ లేనట్టు గుజరాత్ లో అభివృద్ధి లేదని వికాస్ గాన్ క్రేజీ పేరుతో సోషల్ మీడియాలో మొదలైన బిజేపీ వ్యతిరేక ప్రచారాన్ని కాంగ్రెస్ చాకచక్యంగా అందుకుంది. ఏకంగా దాన్ని మోడీ మీదకే ఎక్కు పెట్టింది. దీంతో పాటు రాష్ట్రంలోని అసమ్మతి స్వరాలని మొత్తం కలుపుకుని మోడీ మాయని బద్దలు కొట్టే బ్రహ్మాస్త్రాన్ని రాహుల్ రెడీ చేసుకున్నాడు.

గుజరాత్ లో మోడీ పాపులారిటీ పడిపోవడానికి ఆ రాష్ట్రంలోని వర్తకుల ఆగ్రహమే కారణం. బీజేపీకి గట్టి మద్దతుదారుగా ఉన్న వర్తకులు జిఎస్టీతో మోడీ అంటేనే మండిపడుతున్నారు. అసంతృప్తితో రగిలిపోతున్న పటేల్ వర్గం వీళ్లకు తోడవ్వడంతో అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. జిఎస్టి కి కాంగ్రెస్ ఎంతైనా రుణపడి ఉంటుంది. వర్తకుల ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీ కి తర్జుమా కానున్నాయి. ఇదే సమయంలో మహిళల మద్దతు కూడా కాంగ్రెస్ కు విపరీతంగా పెరిగినట్టు తెలుస్తుంది. రాహుల్ యూ క్యూట్ బాయ్…  ఇప్పటికే హార్దిక్ పటేల్, జిగ్నేష్ మెవని, అల్పేష్ ఠాకూర్ ల మద్దతు కాంగ్రెస్ కుడగట్టింది. సమాజిక సమీకరణలు పతాక స్థాయికి చేరుకున్నాయి.

గుజరాత్ లో ఒఖి తుఫాను తీరం దాటనుంది. ప్రకృతి విధ్వంసం ఏ స్థాయిలో ఉన్నా ఎన్నికల ఫలితాలు ఎవరెవరి సీటు కిందకు ఎంతెంత నీరు చేరుస్తాయో తెలియాలంటే డిసెంబర్ 18 వరకు ఆగాల్సిందే.

                     ఏ భాయ్… అమిత్ భాయ్ . జరా దేఖ్  కే గాడి చలోవో నా…