Home > ఆరోగ్యం > మరణమా నీ చిరునామ ఎక్కడ..

మరణమా నీ చిరునామ ఎక్కడ..

మరణమా నీ చిరునామ ఎక్కడ..

లైఫ్ ఈజ్ ఏ జర్నీ. ఏ స్టేషన్ లో దిగాల్సినవాడే అక్కడ కంపల్సరీగా దిగాల్సిందే. ఆ స్టేషన్ ఎప్పుడొస్తుందో చెప్పే లెక్కలు లేవు. మరణం ఎప్పుడైనా విరుచుకుపడొచ్చు. పసిగుడ్డైనా, నూరు వసంతాల నిలువెత్తు అనుభవమైనా జో భీ హో ఈక్వెషన్ మారదు. రక్తమాంసాలను పంచి రూపాన్నిచ్చే అమ్మను, భుజాలపై ఎత్తుకుని మొదటి సవారీ చేయించే నాన్నను కళ్లముందే మరణం మట్టిలో కలుపుతుంది. తలకొరివి పెడతాడనుకునే కొడుకును, కంటికి రెప్పలా కాపాడుకునే కూతుర్ని తిరిగిరాని లోకానికి తీసుకెళుతుంది. మనిషికి తోడుంటే మరో మనిషిని, ప్రతీ మనిషిని చావు చంపేస్తుంది. ఒక్కడినే కాదు ఆ వ్యక్తితో అల్లుకున్న బంధాలు, మమతల్ని కూడా అంతం చేసి బతికి ఉన్నవాళ్లను క్షణక్షణం చంపుతుంది. అస్తిత్వాన్ని మాయం చేసి అశాశ్వతమైన దేహాన్ని మట్టిలో కలిపే మరణాన్ని ఎవరూ కోరుకోరు. ఆ ముగింపును చూడాలనుకునేవాళ్లు, ఆ తీరం చేరాలనుకునేవాళ్లు ఎవరూ ఉండరు. కాని ఢిల్లీకి రాజైనా, గల్లీ గరీబోడైనా కంటి ముంద మృత్యువు కనిపించగానే కామ్ గా తలవంచుతారు. అందుకే మరణం మనిషి చివరి భయంగా మారింది. తో యే డర్ కే ఆగే క్యా హై? మరణం తర్వాత ఏమవుతుంది? సైన్స్ సింపుల్ గా చాప్టర్ క్లోజ్ అంటుంది. కాని మరణం తర్వాత మనిషి చేరే లోకపు చిరునామాను సైన్స్ కనిపెట్టలేకపోతుందని నమ్మేవాళ్లూ ఉన్నారు. ఇందులో ఏది నిజం?

మరణం- శాస్త్రీయ నిర్వచనం

ఆకాశం నుంచి ఊడిపడేది కాదు మరణం, మన శరీరంలోనే సహజంగా కళ్లు తెరిచే కర్కశం చావు. ప్రాణం పోసే ఆక్సిజన్ తోనే మరణం మన గొంతు కోస్తుంది. శరీర కణాల్లో ఉండే పవర్ స్టేషన్ ఆక్సిజన్ రూపంలో కాలుష్యాన్ని విడుదల చేస్తుంది. విచ్చలవిడిగా తిరిగే ఆక్సిజన్ అణువులతో ఆ కణం డే బై డే దారుణంగా డ్యామేజ్ అవుతుంటుంది. వన్ బ్యాడ్ మార్నింగ్ ఆ కణం పూర్తిగా చనిపోయి శరీరం అంతం అవుతుంది. ఎలా చనిపోతామనడానికి చెప్పుకునే సహజమైన కారణాల్లో ఇదొకటి అయితే ఇంకొకటి ఏంటంటే ఒక కణం నుంచి ఇంకో కణం ఇలా మనిషి పుట్టినప్పటి నుంచి శరీరంలోని కణాలు కోట్లాది కణాలను తయారుచేస్తూనే ఉంటాయి. వాటిలోని డీఎన్ఏను కొత్త కణంలోకి కాపీ చేస్తాయి. ప్రతిసారీ కాస్త డీఎన్ఏ పాత కణంలోనే ఉండిపోతుంది..ఆ కణంతో పాటే అందులోని డీఎన్ఏ కూడా అంతమవుతుంది..దీంతో కోట్లాదిసార్లు కణాలు కాపీ అయ్యాక చాలా డీఎన్ఏను కోల్పోతాం. కణాలు కొత్తగా పుట్టవు..అలా జరిగిన కొన్ని గంటల తర్వాత మరణమనే ఆఖరి ఫీలింగ్ ను కూడా అనుభవిస్తాం.

పునరపి జననం పునరపి మరణం

నమ్మకానికి నిజంతో పనిలేదు. అందుకే భూమ్మీద ముగిసిన జీవితం అంతులేని కథలా ఇంకెక్కడో కంటిన్యూ అవుతుందని నమ్మేవాళ్లున్నారు. మరణం తర్వాత ఏంటన్న ప్రశ్నకు మెజార్టీ మతాల్లో సమాధానం ఉంది. మంచి చేస్తే స్వర్గానికి, తప్పు చేస్తే నరకానికి పోతారని కొన్ని మతాలు భయపెడితే, బిందాస్ గా బతికినట్టే చచ్చాక కూడా చిల్ గా బతకొచ్చని మరికొన్ని మతాలు లేని పోని ఆశలు కల్పిస్తాయి.

హిందూ జీవన విధానం నమ్మకాల ప్రకారం పుట్టినవాడు గిట్టక తప్పుదు.మరణించినవాడు తిరిగి జన్మించక తప్పుదు. అనివార్యమైన ఈ విషయం గురించి ఆలోచించడం తగదని గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పాడు. అలా చూస్తే చనిపోయిన తరువాత కూడా జీవితం ఉంటుంది. కాకపోతే మనిషి చేసే కర్మల మీద ఆధారపడి మరణం తర్వాతి జీవితం ఉంటుంది..కర్మ అంటే శారీరకంగా కాని, మానసికంగా కాని చేసే పని. ముందుజన్మలో చేసిన కర్మ ఫలంతోనే ప్రతీ జీవి పుడుతుంది. చెడు కర్మకి పాపం, మంచి పనికి పుణ్యం దక్కుతాయి. వీటిని అనుభవించడానికే ప్రతి జీవి తప్పనిసరిగా జన్మిస్తాడు. మనం దుస్తులు మార్చుకున్నట్టే ఒక దేహాన్ని వదిలి ఇంకో శరీరంలోకి ఆత్మ వెళుతుందని కృష్ణ భగవానుడు చెప్పాడు. ఆత్మకు నాశనం లేదన్నాడు. ఈ నమ్మకాల ప్రకారం చూస్తే మరణంతోనే మనిషి అంతం కాడు. కచ్చితంగా మరో జన్మ ఎత్తుతాడు. అయితే ఈ వాదనను బౌధ్ధం సమర్థిస్తే, క్రైస్తవం, ఇస్లాం మాత్రం కాదంటాయి. క్రిస్టియానిటీ నమ్మకాల ప్రకారం ఒక వ్యక్తి చనిపోయాక అతని ఆత్మ రెండవ స్వర్గమైన ప్యారడైజ్ కి వెళుతుంది. రెండవ రాక సమయంలో జరిగే అంతిమ తీర్పు రోజున చనిపోయినవాళ్లందర్నీ యేసుక్రీస్తు విచారిస్తాడు. మంచి చేసిన వాళ్లను స్వర్గానికి, పాపాలు చేసినవాళ్లను నరకానికి పంపుతాడన్నది క్రైస్తవుల నమ్మకం. దీంతో చనిపోయాక జరిగే తంతు ముగుస్తుందని ఆ తర్వాత ఏముండదని క్రిస్టియన్లంటారు.

నానమ్మ తాతయ్య క్రిస్టీనా

చనిపోయాక ఏం జరుగుతుందో తెలియాలంటే మరణించిన వాళ్లెవరైనా వచ్చి చెప్పాలి..లేదంటే చచ్చిబతికిన వాళ్లైనా చెప్పాలి.. వాళ్లయితేనే చావు తర్వాత ఏం జరుగుతుందో చెప్పగలరు. అందుకే క్రిస్టీనాపై ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన చర్చ నడిచింది. జర్మనీ కుబ్లాంజ్ లో టీచర్ గా పనిచేసే క్రిస్టీనా స్టైన్ స్కూల్ కు పోతూ కారు ప్రమాదానికి గురైంది. గంటన్నర శ్రమిస్తే కాని శకలాల్లో నుంచి క్రిస్టీనాను బయటకు తీయలేకపోయారు. హాస్పిటల్ కు తీసుకువెళ్లే సరికే ఆమె గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. అంటే క్రిస్టీనా చనిపోయింది. కాని మెదడు మాత్రం పనిచేస్తుంది. మనిషి చనిపోయిన 37 గంటల వరకు మెదడు పనిచేస్తూనే ఉంటుంది. మెదడు పనితీరు ఆగిపోతేనే మరణం పరిపూర్ణం అయినట్టు. ఆ లోపు గుండె తిరిగి కొట్టుకుంటే బతకొచ్చు. అందుకే క్రిస్టీనా గుండె తిరిగి కొట్టుకునేలా చేయడానికి డాక్టర్లు విశ్వ ప్రయత్నం చేశారు. సర్జరీ చేస్తున్న డాక్టర్లు ఓ వింతను చూశారు. క్రిస్టీనా కళ్లలో నుంచి నీళ్లు రావడం డాక్టర్లకు కొత్తగా అనిపించింది. ఎందుకంటే చనిపోయినవాళ్లకు కన్నీళ్లు రావు. కాని క్రిస్టీనా మాత్రం ఏడ్చుకుంటూ స్పృహలోకి వచ్చింది. ఇంతేకాదు ఆపరేషన్ థియటర్ లో తనకు ఏం చేసింది? డాక్టర్లు ఏంఏం మాట్లాడుకున్నది అన్నింటినీ పూసగుచ్చినట్టు వివరించింది. ఆమె మాటలు విని డాక్టర్లు అవాక్కయ్యారు. సరే అసలేం జరిగిందో చెప్పాలని అడిగిన ప్రశ్నకు క్రిస్టీనా చెప్పిన సమాధానం విపరీతమైన చర్చకు కారణమైంది.

క్రిటికల్ కండీషన్ లో ఆపరేషన్ థియేటర్ బెడ్ మీదున్న క్రిస్టీనాకు ఉన్నట్టుండి గాల్లో తేలినట్టు అనిపించింది. గది పైకప్పు నుంచి తనకు జరుగుతున్న సర్జరీ కనిపించింది. ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే ఓ ప్రకాశవంతమైన వెలుగు క్రిస్టీనాను కొత్త లోకానికి తీసుకెళ్లింది. అక్కడామెను ఎవరో పేరు పెట్టి పిలిచారు. ఇద్దరు ముసలివాళ్లు దగ్గరికొచ్చి ఆప్యాయంగా పలుకరించారు. వాళ్లు మరెవరో కాదు క్రిస్టీనా నానమ్మ,తాత. క్రిస్టీనా చిన్నగా ఉన్నప్పుడే చనిపోయిన వాళ్లిద్దర్ని చూసిన తర్వాత తాను కూడా చనిపోయినట్టు,స్వర్గంలో ఉన్నట్టు అర్థం అయింది. నానమ్మ, తాతయ్యతో మాట్లాడుతుంటే తనకు తెలిసిన మరికొంతమందిని క్రిస్టీనా చూసింది..అక్కడి నుంచే తనకు జరుగుతున్న ట్రీట్ మెంట్ క్రిస్టీనాకు కనిపించింది. ఇక్కడికి మరోసారి వద్దువుగాని, మరికొన్ని రోజులు భూమ్మీదనే ఉండమని గ్రాండ్ పేరెంట్స్ చెపుతున్న మాటలు పూర్తికాకుండానే క్రిస్టీనా అక్కడి నుంచి మాయం అయింది. ఆపరేషన్ థియేటర్ లో కళ్లు తెరిచింది.

అంతా భ్రాంతియేనా?

కొత్త లోకాన్ని చూసినట్టు, తమవారిని కలుసుకున్నట్టు చచ్చిబతికిన ఎంతోమంది చెప్పడాన్ని సైంటిస్టులు లైట్ తీసుకుంటారు. గుండెపోటు,యాక్సిడెంట్లు,దీర్ఘకాలిక రోగాలతో చచ్చిబతికిన 70 శాతంమంది ఇలానే చెపుతారన్నారు.. దీనికి హెల్యూసినేషనే కారణమన్నారు..నిద్రలో కలిగే రెమ్ స్లీప్ లాంటి ఫీలింగే చావుతో తలపడుతున్నప్పుడు కలుగుతుందట. ఆ టైంలో జ్ఞాపకాలను మెదడు రివైండ్ చేసుకుంటుంది..దాని ఫలితంగానే ఏదో కొత్తలోకంలోకి వెళ్లినట్టు అక్కడ తమవారిని కలుసుకున్నట్టు అనిపిస్తుందట. కీలకమైన విషయం ఏంటంటే చిన్నప్పటి నుంచి మనకు తెలియకుండా మెదడులో రికార్డ్ అయ్యే మతపరమైన భావాలు, చావు తరువాత ఇలా ఉంటుందన్న వాదనలతో ఈ హెల్యూసినేషన్ రక్తి కడుతుందట. అందుకే క్రిస్టీనా చూసింది నిజమే కాని ఆమె చూసింది అనుభవించింది మాత్రం నిజం కాదని సైంటిస్టులు తేల్చారు.

అయితే చచ్చి బతికి వచ్చామని చెప్పుకునే వాళ్లందరూ కామన్ గా ఒక పాయింట్ చెప్పారు. వెలుగు కనిపించడం, తమను వేరే లోకానికి తీసుకెళ్లిందన్న విషయాన్ని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు చెప్పారు. చావు తర్వాత వీళ్లందరికి ఒకే రకమైన ఫీలింగ్ ఎందుకు కలిగిందన్న విషయంలో మాత్రం సైంటిస్టులకు క్లారిటీ లేదు.

అనిత చెప్పిన సారీ

హాంకాంగ్ లో ఉండే అనితా మూర్జానీకి కలిగిన అనుభవం సైంటిస్టులకు సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది.. 2002 లో అనిత కాలర్ బోన్ పై కణితి ఏర్పడింది.. క్రమంగా పెద్దదయింది..డాక్టర్లకు చూపిస్తే క్యాన్సర్ అని తేలింది..తగ్గాలంటే కీమోథెరపీ చేయించుకోవాలన్నారు. అయితే కీమో కన్న చావడం బెటర్ అనుకున్న అనిత, ఆల్టర్ నేట్ ట్రీమ్ మెంట్ ను ఆశ్రయించింది. కాని కెన్సర్ తగ్గలేదు. ఫలితంగా 2006 ఫిబ్రవరి 10న అనిత నిద్రలేవలేదు. హాస్పిటల్ కు తీసుకెళ్తే బయోలాజికల్ గా అనిత చనిపోయిందని, మెదడు మాత్రం బతికే ఉందన్నారు. దగ్గరి బంధువులను పిలిపించుకోమన్నారు. కాని చనిపోయిందనుకున్న అనిత ఓ వెలుగును చూసింది. అందులో నుంచి అనిత బెస్ట్ ఫ్రెండ్ విద్య వచ్చింది. క్యాన్సర్ తో చనిపోయిన విద్యకు అనిత సారీ చెప్పింది.చివరి ఘడియల్లో పక్కన లేనందుకు క్షమించాలంది. అప్పుడు విద్య చెప్పిన మాట విని అనిత ఆశ్చర్యపోయింది. ఉండాలంటే ఇక్కడే ఉండొచ్చు వెళ్లాలనుకుంటే వెళ్లిపోవచ్చని విద్య అంటుంటుంగానే తిరిగి వెళ్లినా క్యాన్సర్ తో నరకం అనుభవించడమే కదా అంది అనిత. అంతే ఆ తర్వాత విద్య కనిపించలేదు. వెలుగు మాయం అయింది. అనిత స్పృహలోకి వచ్చింది. అప్పటికే అనిత చనిపోయి ఏడు రోజులయింది. అయితే ఇండియా నుంచి బంధువులు రావడంలో ఆలస్యం కావడంతో చివరి ప్రయత్నంగా డాక్టర్లు అనితకు ట్రీట్ మెంట్ కంటిన్యూ చేశారు. ఆ ఏడు రోజుల తన చుట్టూ ఉన్న వాళ్లు ఏం చేసింది ఏం మాట్లాడుకున్నది అంతా అనిత చెప్పింది. ఇంతేకాదు అనిత స్పృహలోకి వచ్చిన మూడు రోజుల తర్వాత ఆమె క్యాన్సర్ కణతి 65 శాతం తగ్గింది. మూడు వారాల తర్వాత మాయమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డాక్టర్లకు అనిత కేస్ స్టడీ అయింది.

ఆత్మబంధం

1901 లో డంకన్ మెక్ డాల్ అనే అమెరికన్ డాక్టర్ చేసిన ఓ పరిశోధన కొత్త చర్చకు కారణమైంది. చనిపోవడానికి ముందు చనిపోయాక ఆరుగురు మనుషుల బరువు కొలిచిన డంకన్ అందులో తేడాను గుర్తించాడు. మనిషి చనిపోయాక శరీరం నుంచి ఏదో శక్తి బయటకు పోతుందని అందుకే మరణం తర్వాత శరీర బరువులో 21 గ్రాముల తేడా వస్తుందన్నాడు. ఈ థియరీని సైంటిస్టులు కొట్టిపారేశారు. అయితే డంకన్ మాత్రం చనిపోయాక శరీరం నుంచి బయటకు వెళ్లే శక్తి ఆత్మనే అన్నాడు

చెట్టు నుంచి నేల మీద పడిన విత్తనం ప్రకృతి నుంచి గాలి, నీరు, ధాతువుల్ని తీసుకొని మొలకగా మారుతుంది. అదే మొక్కగా, వృక్షంగా ఎదుగుతుంది. అదే చెట్టు చనిపోయాక అనేక రూపాల్లో మళ్లీ ప్రకృతిలో కలిసిపోతుంది. ఇదంతా ఒక సైకిల్. అంటే లోకంలో కొత్తగా పుట్టేదేమీ లేదు. అలాగే నాశనం అయ్యేదీ ఉండదు. ఒకే పదార్థం కాలం తీరగానే,మరో రూపంలోకి మారిపోతుందంతే. భౌతికశాస్త్ర నియమాలు కూడా ఇదే చెపుతున్నాయి. శక్తిని పుట్టించలేం.అంతం చేయలేం..జస్ట్ అది రూపం మార్చుకుంటుంది. సేమ్ ఈక్వేషన్ తో మనిషిని ఊహించుకుంటే దేహం, మనసు, ఆలోచన, ఆత్మ అన్నీ శాశ్వతమే. ఆత్మ అంటే దేహానికి చైతన్యాన్నిచ్చే ప్రాణశక్తి. ఆ చైతన్యం శరీరాన్ని వదలడమే మరణం. దేహం, ఆత్మ రెండూ ప్రకృతిలో నిరంతరం తిరిగే శక్తి రూపాలు..ఈ లెక్క ప్రకారం చూస్తే..మరణం తరువాత కూడా జీవితం ఏదో ఒక రూపంలో ఉండొచ్చన్నమాట.

Updated : 22 July 2017 12:32 AM GMT
Tags:    
Next Story
Share it
Top