రజినీకాంత్ చెప్పింది నిజమేనా? పెరియార్ సీతారాములను నగ్నంగా ఊరేగించారా? - MicTv.in - Telugu News
mictv telugu

రజినీకాంత్ చెప్పింది నిజమేనా? పెరియార్ సీతారాములను నగ్నంగా ఊరేగించారా?

January 23, 2020

rajinikanth.

‘అమ్మ’లేని తమిళనాడు చాలా రోజులుగా స్తబ్దంగా ఉంది. పెద్ద వివాదాలేవీ రగలడం లేదు. ఈ కొరతను తీర్చడానికా అన్నట్టు సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ గతాన్ని తిరగదోడారు. దీనిపై అటు సినీ పరిశ్రమలో, ఇటు రాజకీయాల్లో చర్చోపచర్చలు, తిట్లు, విమర్శలు జోరుగా సాగుతున్నాయి. ద్రవిడ ఉద్యమ పితామహుడు పెరియార్ ఈవీ రామస్వామి ‘చేసిన పని’ అంటూ రజనీ అవాకులు చవాకులు పేలాడని కొందరు మండిపడుతోంటే, ఆయన ఉన్న విషయం చెప్పాడని, అందుకు గింజుకోవాల్సిన పనేముందని మరికొందరు అంటున్నారు. ఇది ‘సీతారాముల’ విషయం కావడంతో బీజేపీ నేతలు కూడా వివాదంలోకి చొరబడుతున్నారు. 

రజనీ ఏం చెప్పారు? 

ప్రముఖ తమిళ పత్రిక ‘తుగ్లక్’ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా  గతవారం నిర్వహించిన సభలో రజనీ మాట్లాడారు. ‘1971లో సేలంలో పెరియార్ శ్రీరామచంద్రమూర్తి, సీతల విగ్రహాలను బట్టలు లేకుండా ఊరేగించారు. చెప్పుల దండలు కూడా వేశారు. ఆనాడు ఈ వార్తను ప్రచురించడానికి ఎవరూ ధైర్యం చేయలేకపోయారు. చో(తుగ్లక్ పత్రిక సంపాదకుడు) ఆ వార్తను పత్రిక తొలి పేజీలో ముద్రించి ఖండించారు. ప్రభుత్వానికి చెడ్డపేరొచ్చింది. ఊరేగింపు వార్త ప్రజలకు చేరకుండా తుగ్లక్ పత్రిక కాపీలను జప్తు చేశారు..’ అని తెలిపారు. దీంతో ద్రవిడ సంఘాలు రజినీపై కన్నెర్రజేసి, క్షమాపణ చెప్పాలన్నాయి. అయితే తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని రజినీ అన్నారు. నాస్తికుడైన పెరియార్ 1971కి ముందు దశాబ్దాల కిందటే హిందూ దేవుళ్ల విగ్రహాలను కాల్చేశారు. చెప్పుల దండలు కూడా వేశారు. ఈ విషయాలన్నీ అందరికీ తెలిసినవే. ద్రవిడ రాజకీయాల్లో అవొక భాగం. అయితే వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండడం, తన పార్టీ కూడా పోటీ చేస్తుందని రజనీ చెప్పడంతో ‘ర్యాలీ’ వార్త మళ్లీ రాజుకుంది. 

దురాచార నిర్మూలన ర్యాలీ

1971 జనవరి 15 నాటి ‘హిందూ’ పత్రికలో వచ్చిన వార్త ప్రకారం.. ‘ఆ రోజు సేలంలో మురుగ జననం, మోహినీ అవతారం, పది అడుగులు రాముడి కటౌట్ కూడా ఉన్నాయి. జనం చెప్పులతో కొట్టారు. దురాచార నిర్మూలన సదస్సు  పేరులో భాగంగా ఆ ర్యాలీ తీశారు. ఇస్లాం, క్రైస్తవం, హిందూమతాల విశ్వాసాలను విమర్శించే స్వేచ్ఛ ఉండాలని ఒక తీర్మానం కూడా చేశారు..’. 

‘కాదు కాదు, జరిగింది ఇదీ…’

అయితే ర్యాలీలో రాముడిని ఉద్దేశపూర్వకంగా అవమానించలేదని ద్రావిడార్ కళగం నేత కలి పుంగుండ్రన్ చెప్పారు. ఆ రోజు తాను కూడా అక్కడ ఉన్నానని వెల్లడించారు. ‘పెరియార్ ఊరేగింపులో ఓ ట్రక్కులో వెళ్తుండగా జన సంఘ్ కార్యకర్తలు నిరసనగా నల్లజెండాలు చూపారు. పెరియార్ వైపు చెప్పు విసిరారు. ద్రవిడ కళగం కార్యకర్తలు ట్రక్కులోని రాముడి ఫోటోను చెప్పులతో కొట్టారు..’ అని అన్నారు. ర్యాలీ గురించి పెరియార్ మాట్లాడినట్లు చెబుతున్న ఆడియో కూడా తెరపైకి వచ్చింది. ‘ఎదుటి గ్రూపు(జనసంఘ్) వైపు నుంచి ఒక చెప్పు మావైపు వచ్చింది. దీంతో మా వాళ్లు ఆ చెప్పుతో రాముడి బొమ్మలను కొట్టారు. తర్వాత రాముడి దిష్టిబొమ్మను కాల్చేశారు.. ’ అని పెరియార్ చెబుతున్నారు!

తుగ్లక్ పత్రికలో ఏముంది? 

చో పత్రికలో వచ్చిన కథనం అంటూ కొందరు పేపర్ కటింగ్స్ బయటికి తీస్తున్నారు. అయితే అందులోని చిత్రాలు చాలా అస్పష్టంగా ఉన్నాయి. మోహినీ అవతారం బొమ్మలు కొంచెం గుర్తుపట్టేలా ఉన్నాయి. రాముడిని చూపే చిత్రాలు గుర్తించలేని విధంగా ఉన్నాయి. నాటి ఊరేగింపులో రాముడిని కొట్టారని ఎస్ రాబర్ట్సన్ అనే రచయిత కూడా చెప్పినట్లు.. ‘దళిత్ థియాలజీ అండ్ దళిత్ లిబరేషన్’ అనే పుస్తకంలో ఉంది. మొత్తానికి ఎవరి వెర్షన్ ఎలా ఉన్నా ఆ రోజు ర్యాలీ జరగడం, అందులో రాముడికి అవమానం జరగడం వాస్తమేనని నిర్ధారణకు రావచ్చు.