కొత్త పార్లమెంటులోకి చారిత్రిక వస్తువు
మరో మూడు రోజుల్లో కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం అవనుంది. ప్రధాని నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించనున్నారు. కొత్త భవనమే కాదు మరొ కొత్త వస్తువు కూడా పార్లమెంటుకు చేరబోతోంది. అదే సెంగోల్. అసలేమిటీ సెంగోల్…దీని వెనుక ఉన్న కధ ఏమిటో చూద్దాం రండి.
ప్రారంభోత్సవంలో ఓ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నారు. పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ.. స్పీకర్ కూర్చి దగ్గర చారిత్రాక రాజదండాన్ని అదే సెంగోల్ ను ఉంచుతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. బ్రీటిష్ వారు పోతూ పోతూ దీన్ని అప్పటి ప్రధాని నెహ్రూకు అప్పగించారుట. ఇది తమిళ పదం సెమ్మై నుంచి వచ్చింది.
సెంగోల్ అంటే ధర్మం అని అర్ధం. బంగారంతో చేసిన సెంగోల్ భారత స్వాతంత్య్రానికి సంబంధించి ముఖ్యమైన చారిత్రక చిహ్నమని… ఇది బ్రిటిష్ వారి నుంచి అధికారాన్ని భారతీయులకు బదిలీ చేయడాన్ని సూచిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఆగస్ట్ 14, 1947 రాత్రి 10.45 గంటల సమయంలో.. పండిట్ నెహ్రూ తమిళనాడులో బ్రిటిష్ వారి నుంచి ఈ రాజదండాన్ని తీసుకున్నారు. ఆగస్టు 15, 1947 అర్ధరాత్రి నెహ్రూ జాతీయ జెండాను ఎగురవేసి, ప్రసంగించే ముందు సెంగోల్ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. దీనిని అప్పటినుంచి.. ఇప్పటి వరకు ప్రయాగ్‌రాజ్ మ్యూజియంలో ఉంచారు.
ఈ రాజదండాన్ని పార్లమెంటులో ఉంచాలన్న సలహా ఒక ప్రముఖ నృత్య కళాకారిణి ఇచ్చారుట. సెంగోల్ గురించి విరిస్తూ పద్మా సుబ్రహ్మణ్యం అనే కళాకారిణి ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాశారు. దాంతో పాటూ పలు పరిశోధనలు కూడా ప్రచురించారు. ఆ తర్వాత ప్రభుత్వం అధికారులతో పరిశోధనలు చేయించి…రాజదండాన్ని పార్లమెంటులో ఉంచాలని నిర్ణయించింది.
బ్రిటిష్ వారి నుంచి భారతీయులకు అధికారాన్ని బదిలీ చేయడం కోసం భారత ప్రభుత్వం తమిళనాడు చోళ రాజుల పవిత్రమైన సెంగోల్-వెస్టింగ్ నమూనాను అనుసరించింది. పవిత్రమైన, తమిళ వచనమైన తేవరం పాడే మధ్య అప్పటి ప్రధానమంత్రికి సెంగోల్‌ను అప్పగించారు. దైవిక ఆశీర్వాదాలకు ప్రతీక, న్యాయంగా, ధర్మంగా పాలించమని ఆజ్ఞగా దీనిని అప్పట్లో భావించారు. నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా, సమకాలీన వార్తాపత్రికలు, పుస్తకాలు అలాగే ఆన్‌లైన్‌లో దీని మీద సమాచారం ఉంది.
బంగారు రాజదండం… ఆభరణాలు పొదిగించబడి ఉందని… అప్పట్లో దాని విలువ రూ.15,000 అని… చెన్నైకి చెందిన వుమ్మిడి బంగారు చెట్టి అండ్ సన్స్ తెలిపింది. వుమ్మిడి బంగారు చెట్టి కుటుంబం తామే సెంగోల్‌ను తయారు చేసినట్లు ధృవీకరించారు. దీన్ని తయారు చేసిన కుటుంబంలోని పెద్ద 95 ఇప్పటికీ ఉన్నారు. అయితే వయసు పైబడడం వలన ఆయనకు ఏమీ గుర్తు లేదు అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాకపోతే సెంగోల్ వేడుక ఫోటో వారి ఇంట్లో ఇప్పటికీ ఉందని చెబుతున్నారు.