What is the government's response to Adani's scam?
mictv telugu

అదానీ వ్యాపార సామ్రాజ్యం ఎదుగుదల-చీకటి నిజాలు

February 3, 2023

 

What is the government's response to Adani's scam?

అక్రమంగా సంపాదించినది ఎప్పటికైనా పోక తప్పదు. మనది కాని సొమ్ము మన నుంచి దూరం అయిపోతుందని పెద్దలు అంటారు. అదానీ లాంటి వాళ్ళను చూసినప్పుడు ఈ మాటలు నమ్మకతప్పదు. అడ్డగోలుగా పెంచేసిన అదానీ సామ్రాజ్యం ఇప్పుడు పేకమేడలా కూలిపోతోంది. అయితే ఇంతలా ఈ సామ్రాజ్యం పెరగడానికి కారణం ఎవరు? కేవలం మొత్తం అంతా అదానీల టాలెంట్ తోని, అదృష్టంతోనే నడిచిందా లాంటి అంశాలు ఇప్పడు తెరపైకి వస్తున్నాయి. అదానీ వ్యాపార ఎదుగుదలను, అతని సామ్రాజ్య విస్తరణను ఒక్కసారి పరిశీలించి చూస్తే అసలు నిజాలు తెలుస్తాయి.

సడెన్ గా ఒకరు అమాంతం పెరిగిపోతున్నారు. దేశంలో కీలకమైన ప్రాజెక్టులు అన్నీ వాళ్ళకే దక్కుతున్నాయి అంటే కచ్చితంగా వాళ్ళ వెనుక ప్రభుత్వం, అందులో ఉండే పెద్దల హస్తం ఉండాలి. అదానీ పెరుగుదలను చూస్తే అతని వెనుక ప్రభుత్వం అండదండలు ఉన్నాయన్న విషయం స్పష్టంగా అర్ధం అవుతుంది. ప్రభుత్వ వ్యవస్థలను కాదని దేశంలో ఏ వ్యాపారవేత్త ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. అలాగే అదానీ వెనుక కూడా ఉన్నారు. అది సాక్షాత్తు ప్రధాని మోడీనే అన్నది బహిరంగ రహస్యం. ప్రధాన మంత్రి సహాయ సహకారాలతో ప్రపంచ కుబేరునిగా ఎదిగిన అదానీ వ్యాపారాలు కుప్పకూలిపోతున్నాయి. అదే సమయంలో భారత ఆర్ధిక వ్యవస్థ కూడా పతనం అవుతోంది. అయితే అదానీ వ్యాపారాలకు, బారత ఆర్ధిక వ్యవస్థకూ లింకేంటి అంటే…ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్ఐసీ సుమారు 74 వేల కోట్లను అదానీ గ్రూప్ లో పెట్టింది. ఇప్పడు అదానీల పరిస్థితి బాగోలేకపోవడంతో ఎల్ఐసీ షేర్ దారుణంగా పడిపోతోంది. ఒక్కసారే ఎల్ఐసీ 18వేల కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఆ కంపెనీ చరిత్రలో ఇంతలా నష్టపోవడం ఇదే మొదటిసారి.ఇందులో పోయినదంతా ప్రజల సొమ్ము.

అదానీ ఎదిగిన విధానం:

హైస్కూల్ చదువు కూడా లేని ఒక వ్యక్తి ప్రపంచ కుబేరుల్లో ఒకరుగా ఎలా ఎదిగారు. గౌతమ్ అదానీ హైస్కూల్ డ్రాప్ అవుట్. ముందు ఇతను చిన్న వజ్రాల పరిశ్రమలో చిరు ఉద్యోగిగా పనిచేసేవాడు. తరువాత చిన్న చిన్న వ్యాపారాలు చేసి ఎదిగాడు. కాలం కలిసి వచ్చిందో లేకపోతే మరొకటో కానీ ఓడరేవులు కొనే స్థాయికి ఎదిగాడు. అక్కడితో ఆగిపోయి ఉంటే కథ మరోలా ఉండేది. 2000 సంవత్సరంలో మోడీతో పరిచయం అదానీ జీవితాన్ని, వ్యాపారాలను కూడా మలుపు తిప్పింది. అదానీలు గుజరాత్ వాళ్ళు. మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పడు ఆ రాష్ట్రంలో ప్రాజెక్టులు అన్నీ అదానీకే దక్కేవట. మోడీకి, బీజెపీకి అదానీ బినామీ అని కాంగ్రెస్ ఆరోపణ. కార్పొరేట్ కంపెనీలకు, ప్రభుత్వాలకు మధ్య ఇలాంటివి చాలానే ఉంటాయి. కంపెనీలు పార్టీ ఫండ్ లకు డబ్బులిచ్చి అండగా ఉంటాయి. ప్రభుత్వాలు వాళ్ళకి ప్రాజెక్టులు ఇస్తూ ఉంటాయి. దానికి మించి వెళితేనే సమస్య. నరేంద్ర మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రం మీద అదానీ ముద్ర ఉండేదని చెబుతుంటారు. ఇప్పుడు మోడీ ప్రధాని అయ్యాక కూడా దేశం మీద అదానీ ముద్ర ఉందన్న విషయం అందరూ గమనిస్తూనే ఉన్నారు.

అంబానీలు ఎవరు అధికారంలో ఉంటే వారివైపు ఉంటారు, ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే. రాజకీయ పార్టీలకు కూడా ఈ విషయం మీద స్పష్టమైన అవగాహన ఉంది. అయితే ఇందుకు భిన్నంగా బీజెపీ అదానీలను ఎంచుకుందని ఎవర్ని అడిగినా చెబుతారు. 2014 ముందు నుంచే బీజెపీ ఖర్చులన్నీ అదానీనే భరించాడని విపక్షాల వాదన. 2014కు ముందు మోడీ బీజెపీలో అంత బలమైన వ్యక్తి కాదు. ఆయనకు సంబంధించిన రాజకీయ ఖర్చులన్నీ అదానీనే భరించేవాడు. బీజెపీకి సపోర్టర్ గా ఉన్న అదానీని చూసి మోడీ మురిసిపోయేవారని సొంతపార్టీలోనే టాక్. అవసరానికి మించి రుణాలు బ్యాంకుల నుంచి చాలా ఈజీగా మోడీ ఇప్పించేసారని పార్లమెంటులో కాంగ్రెస్ తో సహా విపక్షాలు అన్నీ ఆరోపించాయి.

ప్రపంచం మొత్తం కోవిడ్ తో సతమతమయిపోతూ ఉంటే అదానీ మాత్రం అంచెలంచెలుగా ఎదిగిపోయాడు. జెట్ వేగంతో ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి ఎగబాకాడు. దీనికి కారణం విదేశాల్లో ప్రాజెక్టులను మోడీ అదానీకి ఇప్పించడమే అన్నది కాంగ్రెస్ ఆరోపణ. అక్కడ ఉన్న డొల్ల కంపెనీలను అడ్డుపెట్టుకుని అదానీ అడ్డగోలుగా ఎదిగాడు. కనీసం ల్యాండ్ ఫోన్ కూడా లేని సూట్ కేస్ కంపెనీలను పెట్టుకుని ప్రపంచ కుబేరుడిగా ఎదిగాడని హిండెన్ బర్గ్ లెక్కలు చూపించింది.

అదానీ ఆర్ధిక సామ్రాజ్యం:

అదానీకి బ్యాంకులు ఇచ్చిన రుణాలను గమనిస్తే యూపీఏ ప్రభుత్వం ఉండగా తీసుకున్న వాటికన్నా ఎన్డీయే హయాంలో తీసుకున్నవి కొన్ని రెట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానికి తగిన ఆస్తులు, షేర్ విలువ లేదని హిండెన్ బర్గ్ నివేదిక సారాంశం. దీన్నంతటినీ చూస్తుంటే ఎక్కడో ఏదో గుర్తుకు వస్తోంది కదూ. హా… మన ఆర్ధిక వేత్తలు కూడా సరిగ్గా ఇదే చెబుతున్నారు. 2009లో సత్య రామలింగరాజు కంపెనీ స్కామ్ కూడా ఇలాగే జరిగింది. లేని ఆదాయాన్ని చూపించి, పుస్తకాల్లో అంకెల గారడీ చేసి షేర్ విలువను అమాంతం పెంచేసి కుంభకోణాలు చేసాడు సత్యం రామలింగరాజు. ఇప్పుడు అదానీది కూడా అలాగే ఉంది. షేర్ల విలువల్లో అవకతవకలు, అకౌంట్ మోసాలు, డొల్ల కంపెనీలతో మార్కెట్ ను అధోగతి పాలుచేశాడు అదానీ. సత్యం స్కాంలో 14వేల కోట్ల మోసం జరిగితే అదానీ కుంభకోణంలో 9 లక్షల కోట్ల పైమాటే.

2014 ముందు అదానీ అప్పులు, తరువాత అప్పులు: 

యూపీఏ హయాంలో:

2009 -130 కోట్లు
2010- ఏం లేదు
2011- 583 కోట్లు
2012 – 696 కోట్లు
2013 -744కోట్లు

బీజెపీ హయాంలో:

2014 -15, 299 కోట్లు
2015 -16, 739 కోట్లు
2017 – 4959 కోట్లు
2018 – 2869 కోట్లు
2020 – 17, 707 కోట్లు
2021-51, 657 కోట్లు
2022- 72, 260 కోట్లు

అదానీల గురించి కొన్ని నిజాలు హిండెన్ బర్గ్ నివేదిక ఆధారంగా:

అదానీ ఆస్తి విలువ 120 బిలియన్ డాలర్లు ఇంచుమించుగా. అందులో 100 బిలియన్ డాలర్లు గత మూడేళ్ళలోనే షేర్ల ధరల పెరుగుదల వల్ల వచ్చాయి.

అదానీ గ్రూప్ లో 22 కీల పదవుల్లో 8 మంది అతని కుటుంబ సభ్యులే.

17 బిలియన్ డాలర్లకు సంబంధించిన ఆర్ధిక నేరాల మీద అదానీ గ్రూపును ప్రభుత్వం విచారించింది.విదేశాల్లో షెల్ కంపెనీలు ఏర్పాటు చేయడం, నకిలీ పత్రాలు తయారు చేయడం లాంటివి.

అదానీ తమ్ముడు రాజేశ్ అదానీ 2004-5ల్లో డైమండ్ వ్యాపారానికి సంబంధించిన నేరాల్లో నిందితుడు. అతన్ని రెండు సార్లు అరెస్ట్ కూడా చేశారు. ఇప్పడు అతనే ఇప్పడు అదానీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్. అదానీ బావ సమీర్ వోరా కూడా డైమండ్ వ్యాపార మోసాల్లో రింగ్ లీడర్ అని పేరు ఉంది.

అదానీ అన్న వినోద్ ను దొరకని దొంగ అని మీడియా అంటోంది. ఇతనే మారిషస్ లో 38 షెల్ కంపెనీలను నడుపుతున్నాడు. అయితే వీటికి ఏ ఆధారాలు ఉండవు. కానీ ఇవి మాత్రం అదానీ గ్రూప్ కంపెనీల్లో బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి.

ఆర్టీఐ చట్టం కింది సెబీని ప్రశ్నిస్తే ఈ నేరాల మీద విచారణ జరుగుతున్న మాట వాస్తవమేనని తేలింది.

ELARA అనే ఒక షెల్ కంపెనీ సీఈవో కి ధర్మేష్ దోషి, కేతన్ పరేఖ్ లాంటి షేర్ మార్కెట్ నేరస్తులతో సంబంధాలున్నాయని లీకైన మెయిల్స్ వల్ల తెలుస్తోంది.

ప్రభుత్వం ఏం చేస్తోంది:

సత్యం కుంభకోణం జరిగినప్పుడు ప్రధానిగా మన్మోహనం సింగ్ ఉన్నారు. ఆ స్కామ్ గురించి తెసిన వెంటనే ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకునేలా చేశారు. సీబీఐ దర్యాప్తు చేపట్టారు. కంపెనీ కార్యకలాపాలు నియంత్రణ చేసింది. రామలింగరాజుకు వ్యతిరేకంగా చార్జ్ షీట్ లు దాఖలు అయ్యాయి. అతను జైలుకు కూడా వెళ్ళాడు. సహాయం చేసిన వ్యక్తులకు, సంస్థలకు కూడా శిక్షలు పడ్డాయి. వాటాదారులు, రిటైల్ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను రక్షించడానికి సెబీ లాంటి సంస్థలు పనిచేశాయి.కానీ అదానీ గ్రూప్ విషయంలో ఇందుకు భిన్నంగా జరుగుతోంది. అనాటి ప్రభుత్వం వ్యవహరించినట్టు చేయడం లేదు. అప్పడు రామలింగరాజు కూడా తన నేరాలను ఒప్పుకొన్నాడు. కానీ ఇప్పుడు అదానీ ఏ మాత్రం తగ్గడం లేదు. పెద్దల అండతో మసిపూసి మారేడుకాయ చేయాలని చూస్తున్నారు. అదానీ కంపెనీ అక్రమాల మీద దర్యాప్తు చేసి రుజువులు చూపించడానికి ఈడీ, సీబీఐ, ఐటీ, సెబీ లాంటి సంస్థలు కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఇదే విషయాన్ని నిన్న విపక్షాలు పార్లమెంటులో కూడా చెప్పాయి.పైగా అదానీ గ్రూప్ ను ఆదుకోవడానికి మోడీ సర్కార్ పిల్లిమొగ్గలు వేస్తోందని బోలెడు ఆరోపణలు వస్తున్నాయి.