బెల్లం చుట్టూ ఈగలు ముసరడం సహజం. ఆదాయం చుట్టూ ఆక్రమార్కులు చేరడం సహజం. ప్రభుత్వాలకే కాకుండా, వ్యక్తులకు కూడా కోట్ల ఆదాయం తెచ్చిపెట్టే వాటిలో పెట్రోల్, మద్యం, నిర్మాణాల కాంట్రాక్టులు అగ్రస్థానంలో ఉంటాయి. ప్రజలు ఎంతగా తాగి తందనాలాడితే సర్కారు గల్లాపెట్టె అంతగా కళకళలాడుతుంది. ఒక్కసారి మద్యం లైసెన్సు దొరికితే జాక్ పాట్ కొట్టినట్టే. అందుకే కోట్లాది రూపాయల లంచాలు ముట్టజెప్పి లైసెన్సులు సాధిస్తుంటారు. దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న ఢిల్లీ మద్యం కేసు వెనక కూడా ఈ జాక్ పాట్లే కీలక పాత్ర పోషించాయి. అది కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితమై ఉండుంటే దృశ్యం మరోలా ఉండేది. పలు రాష్ట్రాలకు చెందిన, ముఖ్యంగా పంజాబ్, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల బడాబాబులు ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించడంతో తెలుగు ప్రజలపై ఈ కేసు పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కొడుకు రాఘవరెడ్డిలను ఇప్పటికే అరెస్ట్ చేయడం, తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు, ఆమె రేపోమాపో అరెస్ట్ చేస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ స్కామ్‌పై ఫోకస్ ఇది..
కొత్త విధానం..
ఢిల్లీలో 2021 వరకు మద్యాన్ని ప్రభుత్వమే అమ్మేది. ఈ విధానంలో అక్రమాలకు అవకాశముందని, వ్యాపారాన్ని మొత్తం ప్రైవేటు పరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది జనవరిలో కసరత్తు జరిగింది. సీఎం కేజ్రీవాల్, మంత్రులు సిసోడియా, సత్యేంద్రజైన్, కైలాశ్ గెహ్లాట్‌తో కమిటీని ఏర్పాటు చేశారు. మార్చి 22న కమిటీ నివేదిక తయారు చేసింది. మే నెలలో సీఎం దీనికి ఆమోదం తెలిపారు. రూ. 9500 కోట్ల ఆదాయం తీసుకొచ్చే కొత్త విధానం ప్రకారం రాష్ట్రాన్ని 32 జోన్లుగా విభజించి 849 మద్యం దుకాణాలు తెరవాలి. ఈ విధానానికి అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కొన్ని షరతులు పెట్టారు. అప్పటికే ఉన్న మద్యం షాపుల స్థానంలో ప్రైవేట్ వ్యక్తులకు లైసెన్సులు ఇవ్వాలి, షాపులు లేని చోట ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ, ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ నియమాలను ప్రభుత్వం ఉల్లంఘించి తనకు నచ్చినవారికి లైసెన్సులు కట్టబెట్టింది. అక్రమ మద్యాన్ని అరికట్టడానికి తెచ్చిన ఈ విధానం కూడా చివరికి అక్రమాలకు అడ్డాగా మారిపోయింది. ప్రభుత్వానికి ఆదాయం పెరిగిన మాట నిజమే అయినా కొత్త విధానం ప్రకారం మరింతగా దక్కాల్సిన ఆదాయం ఆప్, ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి వెళ్లింది. మందు ధరలు పెరిగాయి. మందు కోసం జనం తగలేసిన డబ్బులో కొంత ప్రభుత్వ ఖజానాలో కాకుండా రాజకీయ, వ్యాపారుల్ల ఖాతాల్లో పడిపోయింది.
గవర్నర్ అభ్యంతరం.
లిక్కర్ ధరల విషయంలో సంబంధిత అధికార సంస్థల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని, చట్టాలను ఉల్లంఘించారని తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్‌గా వచ్చిన వినయ్ కుమార్ సక్సేనా ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎంఆర్‌పీ ధరలతో సంబంధం లేకుండా ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయించారని, కొందరికి లైసెన్స్ ఫీజుల్లో రాయితీలు ఇవ్వడమే కాకుండా కోట్లకొద్దీ ఫీజు మాఫి చేశారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీబీఐ విచారణకు సిఫార్సు చేశారు.
వందల కోట్ల ముడుపులు
సీబీఐ, ఈడీ దర్యాప్తుల్లోని అంశాల ప్రకారం.. అసలు మద్యం పాలసీ రూపకల్పనలోనే క్విడ్ ప్రోకో విధానంలో అక్రమాలు జరిగాయి. ఆప్ నేతలకు లంచాలిస్తే లైసెన్సులు దక్కుతాయని హింట్ అందడంతో సౌత్ గ్రూప్, ఖావో గలీ రెస్టారెంట్స్, బబ్లీ బేవరేజెస్, ఇండో స్పిరిట్స్, ఇండో స్పిరిట్స్ డిస్ట్రిబ్యూషన్, ట్రైడెంట్ కేంఫర్ లిమిటెడ్, అవంతిక కాంట్రాక్టర్స్, ఆర్గోనామిక్స్ ఈకోసిస్టమ్స్, పెర్నోడ్ రిచర్డ్ ఇండియా లిమిటెడ్, అమిత్ అరోరా, కేఎస్‌జేఎస్ స్పిరిట్స్, మెస్సర్స్ బడ్డీ రిటైల్, పాపులర్ స్పిరిట్స్ తదితర కంపెనీలు క్యూ కట్టాయి. ఆప్ నేతలకు వందల కోట్లు ముడుపులు ముట్టజెప్పాయి. హోల్‌సేల్ మార్జిన్ 12 శాతం, రిటైల్ మార్జిన్ 185 శాతం ఉండేలా పాలసీ రూపొందించారు. లంచాల్లో కొంత భాగాన్ని గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు చేశారు. ఈ స్కాంలో మనీశ్ సిసోడియా ప్రధాన పాత్ర పోషించారు. నాటి ఎక్సైజ్ కమిషనర్ ఆరవ గోపీకృష్ణ, డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ ఏకే తివారీ, అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ పంకజ్ భట్నాగర్‌లతోపాటు మరో 9 మంది వ్యాపారుల హస్తం కీలకం. సిసోడియాకు ఆప్తుడైన దినేశ్ అరోరాకు రాధా ఇండస్ట్రీస్ కోటి రూపాయల లంచం ఇచ్చిన బాగోతాన్ని సీబీఐ సాక్ష్యాలతో బయటపెట్టింది. ఏ కంపెనీల నేతలు, వ్యాపారులు ఎప్పెడెప్పుడు ఎవర్ని కలిశారు ఈడీ, సీబీఐలు తమ పది పన్నెండు వేల పేజీల చార్జిషీట్లలో వివరాలు పొందుపరిచాయి. కవిత తరఫున ఆమె మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, తాజాగా అరెస్టయిన అరుణ్ రామచంద్రన్ పిళ్లై తదితరులు వ్యవహారాలు నడిపారన్నది దర్యాప్తు సంస్థల ఆరోపణ. నిందితులు తమ సెల్ ఫోన్లను నాశనం చెయ్యడం వంటి నేరాలకు కూడా పాల్పడ్డారని చెబుతున్నాయి.
దాడులు..
2022న ఆగస్ట్ 15న సిసోడియా ఇంటితోపాటు 25 చోట్ల సోదాలు రిగాయి. సెప్టెంబర్ 6న హైదరాబాద్‌లోని అరుణ్ రామచంద్రన్ పిళ్లైకు చెందిన రాబిన్ డిస్టలరీస్, రాబిన్ డిస్ట్రిబ్యూటర్స్ కంపెనీలల్లో ఈడీ సోదాలు చేసింది. అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిని విచారించి నవంబర్ 10న అరెస్ట్ చేసింది. అక్టోబర్‌లో బోయిన్‌పల్లి అభిషేక్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. నవంబర్ 29న కవిత పేరు బయటికొచ్చింది. ఆమె రెండు నంబర్లతో పది మొబైల్ ఫోన్లను మార్చి, డిజిటల్ సాక్ష్యాలను ధ్వంసం చేశారని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి.
కవితను విచారించనున్న ఈడీ
ఢిల్లీ లిక్కర్ స్కాం దేశవ్యాప్తంగా హాట్ టాపిగ్గా మారింది. ఈ స్కాంలో మొదటి నుంచీ ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు ఉదయం 10 గంటల తరువాత ఈడీ ఎదుట హాజరు కానున్నారు. కవిత ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. పిళ్లైతో కలిపి కవితను విచారించనున్నట్లు తెలుస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలంటూ శుక్రవారం కవిత జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. దీక్ష ముగిసిన వెంటనే కవిత న్యాయ నిపుణులతో చర్చించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు హస్తినకు చేరుకున్నారు.
అటు ఈ స్కాంలో ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కోర్టు ఏడు రోజుల కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మనీష్ సిసోడియా రిమాండ్ రిపోర్టులోనూ ఈడీ కీలక విషయాలను వెల్లడించింది. రిమాండ్ రిపోర్టులో కవిత పేరును మరోసారి ప్రస్తావించింది ఈడీ. సౌత్ లాబీల గురించిన పలు విషయాలను రిపోర్టులో పేర్కొంది. మొత్తం 9 గ్రూపులను సౌత్ గ్రూపు కైవసం చేసుకుందని ఢిల్లీ లిక్కర్ స్కాం హైదరాబాద్ లోనే జరిగినట్లు ఈడీ తెలిపింది. ఈ కుట్ర మొత్తంగా ఐటీసీ కోహినూర్ హోటల్లో జరిగినట్లు ఈడీ ప్రస్తావించింది.
కాగా కవితకు ఈడీ నోటిసులపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం కవితను అరెస్ట్ చేసే అవకాశం ఉందని..చేస్తే చేసుకోని అంటూ వ్యాఖ్యానించారు. జైల్లో పెడతారు అంతే కదా…దానికి భయపడాల్సిన అవసరమే లేదు. బీజేపీలో చేరని వారిని ఈవిధంగా వేధిస్తున్నారని…కవితను కూడా బీజేపీలో చేరమని అడిగిరాని కేసీఆర్ అన్నారు. ఇక మంత్రి కేటీఆర్, హరీష్ రావు లు ఢిల్లీలో న్యాయ నిపుణులతో భేటీ అయ్యారు. కేసులో లోపాలు, న్యాయపరమైన అంశాలను గురించి చర్చించారు. శనివారం, ఆదివారం రెండు రోజులు కేటీఆర్ అక్కడే ఉండనున్నారు.
కీలక నిందితుల చిట్టా..
మనీశ్ సిసోడియా(మాజీ డిప్యూపీ సీఎం)
విజయ్ నాయర్ (సీఎం కేజ్రీవాల్‌కు సన్నిహితుడు
సమీర్ మహేంద్రు (ఇండో స్పిరిట్స్ యజమాని)
పి. శరత్ చంద్రారెడ్డి ( అరబిందో గ్రూప్ – ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్)
బినొయ్ బాబు (పెర్నార్డ్ రిచర్డ్ కంపెనీ)
అమిత్ అరోరా (లిక్కర్ వ్యాపారి)
గౌతమ్ మల్హోత్రా (పంజాబ్ లిక్కర్ వ్యాపారి)
అభిషేక్ బోయినపల్లి (వ్యాపారి, హైదరాబాద్)
అమిత్ అరోరా (బడ్డీ రిటెయిల్ సంస్థ డైరెక్టర్)
రాజేష్ జోషి ( చారియట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్)
మాగుంట రాఘవ (ఎంపీ శ్రీనివాసుల రెడ్డి కొడుకు)
అరుణ్ రామచంద్రన్ పిళ్లై ( హైదరాబాద్ వ్యాపారి)